మార్కు 3:22-35
మార్కు 3:22-35 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు. కనుక యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఉపమానరీతిగా మాట్లాడారు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు? ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు. అలాగే ఒకవేళ సాతాను తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాడు నిలువలేడు; వాని అంతం వచ్చినట్లే. నిజానికి, బలవంతుడైనవాని మొదట కట్టివేయకుండ అతని ఇంట్లోకి ఎవరు ప్రవేశించలేరు. అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు. ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. కాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఉండదు; వారు నిత్య పాపం చేసిన అపరాధులుగా ఉంటారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. “ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు” అని వారు అంటున్నారు కాబట్టి యేసు ఈ విధంగా చెప్పారు. ఆ తర్వాత యేసు తల్లి మరియు సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు. జనసమూహం ఆయన చుట్టు కూర్చుని ఉండగా, వారు ఆయనతో, “నీ తల్లి మరియు నీ సహోదరులు నిన్ను కలువడానికి వచ్చి బయట వేచి ఉన్నారు” అని చెప్పారు. అందుకు ఆయన, “నా తల్లి మరియు నా సహోదరులు ఎవరు?” అని అడిగారు. ఆయన తన చుట్టు కూర్చున్న వారిని చూసి, “వీరే నా తల్లి, నా సహోదరులు! దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి మరియు తల్లి” అని చెప్పారు.
మార్కు 3:22-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు. యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా. నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే. నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు. అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. వారు ఆయనతో, “నీ తల్లి, సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు” అన్నారు. ఆయన వారితో, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అన్నాడు. తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి” అని అన్నాడు.
మార్కు 3:22-35 పవిత్ర బైబిల్ (TERV)
యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు. అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు? ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది. “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు. “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.” ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు. యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు. “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
మార్కు 3:22-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పెట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను– సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములును మనుష్యులుచేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పెట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన–నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి– ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను.