మార్కు 3:22-35

మార్కు 3:22-35 TCV

యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు. కనుక యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఉపమానరీతిగా మాట్లాడారు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు? ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు. అలాగే ఒకవేళ సాతాను తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాడు నిలువలేడు; వాని అంతం వచ్చినట్లే. నిజానికి, బలవంతుడైనవాని మొదట కట్టివేయకుండ అతని ఇంట్లోకి ఎవరు ప్రవేశించలేరు. అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు. ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. కాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఉండదు; వారు నిత్య పాపం చేసిన అపరాధులుగా ఉంటారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. “ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు” అని వారు అంటున్నారు కాబట్టి యేసు ఈ విధంగా చెప్పారు. ఆ తర్వాత యేసు తల్లి మరియు సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు. జనసమూహం ఆయన చుట్టు కూర్చుని ఉండగా, వారు ఆయనతో, “నీ తల్లి మరియు నీ సహోదరులు నిన్ను కలువడానికి వచ్చి బయట వేచి ఉన్నారు” అని చెప్పారు. అందుకు ఆయన, “నా తల్లి మరియు నా సహోదరులు ఎవరు?” అని అడిగారు. ఆయన తన చుట్టు కూర్చున్న వారిని చూసి, “వీరే నా తల్లి, నా సహోదరులు! దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి మరియు తల్లి” అని చెప్పారు.

మార్కు 3:22-35 కోసం వీడియో