మార్కు 15:21-47

మార్కు 15:21-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం. అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు. “యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు. ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు. ‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది. ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా! ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! ‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం. దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు. అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది. యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు. యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు. యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు. యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు. మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.

షేర్ చేయి
Read మార్కు 15

మార్కు 15:21-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి. అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు. వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను. మరియు–యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతోకూడ సిలువవేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు –ఆహా దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు–వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని–అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమనెను. అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను. ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి–నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్ర్తీలనేకులును వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతిదినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు. పిలాతు – ఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి–ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. అతడు నారబట్టకొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.

షేర్ చేయి
Read మార్కు 15

మార్కు 15:21-47 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు మరియు రూఫసు అనే వారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకొని సిలువ మోయమని బలవంతం చేశారు. వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకొని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం. అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం అనే చేదును కలిపి ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకొన్నారు. ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది. ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: యూదుల రాజు. తిరుగుబాటు చేసిన ఇద్దరు బందిపోటు దొంగలను, ఆయనకు కుడి వైపున ఒకడిని, ఎడమ వైపున మరొకడిని సిలువ వేశారు. [ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడెను అని వ్రాయబడినది.] ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలలో తిరిగి కడతానన్నావు నీవే కదా! సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అంటూ ఆయనను దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు. ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరావాలి” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. దగ్గర నిలబడిన వారిలో కొందరు ఆ మాటలను విని, “వినండి, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. ఒకడు పరుగెత్తుకొని వెళ్లి, ఒక స్పంజీని పుల్లని ద్రాక్షరసంలో ముంచి ఒక కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదలి వేద్దాం. ఏలీయా వచ్చి వీన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అన్నాడు. గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు. అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. యేసుకు ఎదురుగా నిలబడివున్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్నవాడైన యాకోబు మరియు యోసేపుల తల్లియైన మరియ ఇంకా సలోమి ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి, ఆయనకు సేవ చేశారు, వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన అనేకమంది స్త్రీలు కూడ అక్కడ ఉన్నారు. అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కనుక సాయంకాలమైనప్పుడు, అరిమతయికు చెందిన యోసేపు న్యాయసభలో ప్రాముఖ్యమైన సభ్యుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు, అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. ఆయన అప్పటికే చనిపోయాడని విన్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని తన దగ్గరకు పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు. శతాధిపతి నుండి ఆ సంగతిని తెలుసుకున్నాక, యోసేపుకు యేసు శరీరాన్ని అప్పగించాడు. కనుక యోసేపు సన్నని నారబట్ట కొని తెచ్చి, యేసు శరీరాన్ని కిందికి దింపి, దానిని సన్నపు నారబట్టతో చుట్టి, రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. తర్వాత ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి దానిని మూసి వేసాడు. మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూసారు.

షేర్ చేయి
Read మార్కు 15

మార్కు 15:21-47 పవిత్ర బైబిల్ (TERV)

కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు. వాళ్ళు యేసును గొల్గొతాకు తీసుకువచ్చారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం. అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు. ఆ తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేసారు. ఆయన దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకొన్నారు. ఆయన్ని సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలు. ఆయనపై మోపబడిన నేరాన్ని, “యూదులరాజగు యేసు” అని ఒక పలకపై వ్రాసి తగిలించారు. ఆయనతో సహా యిద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువకు వేసారు. ఆ దారి మీద నడిచివెళ్ళే వాళ్ళు ఆయన్ని అవమానపరచారు. వాళ్ళు తమ తలలాడిస్తూ, “మరి మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్న వాడవు గదా. సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” అని అన్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని హేళన చేస్తూ “ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు. ఈ క్రీస్తు, ఈ ఇశ్రాయేలు రాజు సిలువనుండి క్రిందికి దిగివస్తే చూసి అప్పుడు విశ్వసిస్తాము” అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు కూడా యేసును అవమానించారు. మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. మూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అంటే, “నాదేవా! నాదేవా! నన్నెందుకు ఒంటరిగా వదిలివేసావు” అని కేకవేసాడు. దగ్గర నిలుచున్న కొందరు ఇది విని, “వినండి! అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. ఒకడు పరుగెత్తి వెళ్ళి ఒక స్పాంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కట్టెకు తగిలించి యేసుకు త్రాగటానికి అందించాడు. మరొకడు, “అతణ్ణి వదలండి! అతణ్ణి క్రిందికి దింపటానికి ఏలియా వస్తాడేమో చూద్దాం!” అని అన్నాడు. పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు. అప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది. యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని, ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక దేవుని కుమారుడు” అని అన్నాడు. కొందరు స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు సలోమే ఉన్నారు. గలిలయలో ఉన్నప్పుడు వీళ్ళు యేసును అనుసరిస్తూ, ఆయనకు సేవచేస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళేగాక ఆయన వెంట యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. అది సబ్బాతుకు సిద్దమయ్యే రోజు, అనగా విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయంత్రమయింది. అరిమతయియ గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యంకొరకు కాచుకొని ఉండేవాడు. యేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. ఆ సైన్యాధిపతి ఔనని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్ళటానికి యోసేపుకు అనుమతి యిచ్చాడు. యోసేపు, నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కొని వచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి రాతితో మలచిన సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధి మూసివేసాడు. మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు.

షేర్ చేయి
Read మార్కు 15

మార్కు 15:21-47 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు రూఫసు అనేవారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకుని సిలువ మోయమని బలవంతం చేశారు. వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన వస్త్రాలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకున్నారు. ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది. ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: యూదుల రాజు. తిరుగుబాటు చేసిన ఇద్దరు బందిపోటు దొంగలను, ఆయనకు కుడి వైపున ఒకడిని, ఎడమవైపున మరొకడిని సిలువ వేశారు. ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని వ్రాయబడినది. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు నీవే కదా! సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు. ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరా” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువవేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థము. దగ్గర నిలబడిన వారిలో కొందరు ఆ మాటలను విని, “వినండి, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. ఒకడు పరుగెత్తుకొని వెళ్లి, ఒక స్పంజీని పుల్లని ద్రాక్షరసంలో ముంచి ఒక కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని క్రిందికి దించుతాడేమో చూద్దాం” అన్నాడు. గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు. అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. యేసుకు ఎదురుగా నిలబడి ఉన్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్నవాడైన యాకోబు యోసేపుల తల్లియైన మరియ ఇంకా సలోమి ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి, ఆయనకు సేవ చేశారు, వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన అనేకమంది స్త్రీలు కూడ అక్కడ ఉన్నారు. అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కాబట్టి సాయంకాలమైనప్పుడు, అరిమతయికు చెందిన యోసేపు న్యాయసభలో ప్రాముఖ్యమైన సభ్యుడు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు, అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. ఆయన అప్పటికే చనిపోయాడని విన్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని తన దగ్గరకు పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు. శతాధిపతి నుండి ఆ సంగతిని తెలుసుకున్నాక, యోసేపుకు యేసు శరీరాన్ని అప్పగించాడు. కాబట్టి యోసేపు సన్నని నారబట్ట కొని తెచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి, నారబట్టతో చుట్టి, రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. తర్వాత ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి దానిని మూసి వేశాడు. మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు.

షేర్ చేయి
Read మార్కు 15