కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు రూఫసు అనేవారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకుని సిలువ మోయమని బలవంతం చేశారు. వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన వస్త్రాలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకున్నారు.
ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది. ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది:
యూదుల రాజు.
తిరుగుబాటు చేసిన ఇద్దరు బందిపోటు దొంగలను, ఆయనకు కుడి వైపున ఒకడిని, ఎడమవైపున మరొకడిని సిలువ వేశారు. ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని వ్రాయబడినది. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు నీవే కదా! సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు. ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరా” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువవేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థము.
దగ్గర నిలబడిన వారిలో కొందరు ఆ మాటలను విని, “వినండి, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
ఒకడు పరుగెత్తుకొని వెళ్లి, ఒక స్పంజీని పుల్లని ద్రాక్షరసంలో ముంచి ఒక కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని క్రిందికి దించుతాడేమో చూద్దాం” అన్నాడు.
గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.
అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. యేసుకు ఎదురుగా నిలబడి ఉన్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు.
కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్నవాడైన యాకోబు యోసేపుల తల్లియైన మరియ ఇంకా సలోమి ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి, ఆయనకు సేవ చేశారు, వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన అనేకమంది స్త్రీలు కూడ అక్కడ ఉన్నారు.
అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కాబట్టి సాయంకాలమైనప్పుడు, అరిమతయికు చెందిన యోసేపు న్యాయసభలో ప్రాముఖ్యమైన సభ్యుడు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు, అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. ఆయన అప్పటికే చనిపోయాడని విన్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని తన దగ్గరకు పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు. శతాధిపతి నుండి ఆ సంగతిని తెలుసుకున్నాక, యోసేపుకు యేసు శరీరాన్ని అప్పగించాడు. కాబట్టి యోసేపు సన్నని నారబట్ట కొని తెచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి, నారబట్టతో చుట్టి, రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. తర్వాత ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి దానిని మూసి వేశాడు. మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు.