మార్కు 14:32-64

మార్కు 14:32-64 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

తర్వాత వారు గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అన్నారు. ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని పోయి, తీవ్ర వేదనతో బాధపడసాగారు. ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ప్రాణం దుఃఖంతో నిండి ఉంది, కనుక మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి” అని చెప్పారు. ఆయన కొంత ముందుకు వెళ్లి, నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటి పోవాలని ప్రార్థించారు. ఆయన, “అబ్బా, తండ్రీ, నీకు సమస్తం సాధ్యమే. ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, మీ చిత్తమే జరగాలి” అన్నారు. ఆయన తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “సీమోనూ, నిద్రిస్తున్నావా? ఒక గంటయైనా మెలకువగా ఉండలేక పోయావా? మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం.” అని చెప్పారు. ఆయన మళ్ళీ వెళ్లి అదే విధంగా ప్రార్థించారు. ఆయన తిరిగి వచ్చినపుడు, వారి కళ్ళు బరువుగా ఉన్నాయి, కనుక వారు మళ్ళీ నిద్రపోతున్నారని తెలుసుకున్నారు. ఆయనకు ఏమి చెప్పాలో వారికి తెలియలేదు. యేసు మూడవసారి తిరిగి వచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇక చాలు! చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. లేవండి! మనం వెళ్దాం. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకొని వచ్చింది. ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు: “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించి బందోబస్తుతో తీసుకొనివెళ్ళండి.” యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. వారు వచ్చి యేసును పట్టుకొని, బంధించారు. యేసు ప్రక్కన నిలుచున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి చెవిని నరికివేసాడు. యేసు, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతి రోజు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, మీతోనే ఉన్నాను, మీరు నన్ను బంధించలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలని ఇలా జరిగింది” అని చెప్పారు. అప్పుడు అందరు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోయారు. సన్నని నార వస్త్రం మాత్రమే ధరించిన ఒక యువకుడు, యేసును వెంబడిస్తున్నాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు, అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు. వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కాపలా కాస్తున్న వారితో చలిమంట దగ్గర కూర్చొని, చలి కాచుకుంటున్నాడు. ముఖ్య యాజకులు మరియు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు. ఆయనకు వ్యతిరేకంగా అనేకులు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, కాని వాటిలో ఒకదానికొకటి సరిపోలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా ఈ అబద్ధ సాక్ష్యం చెప్పారు: “ ‘ఇతడు మనుష్యుల చేతులతో కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో మనుష్యుల చేతులతో కట్టని మరొక దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి యేసును, “నీవు వారికి సమాధానం ఇవ్వవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న సాక్ష్యాల గురించి నీవు ఏమంటావు?” అని అడిగాడు. కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు. ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?” అని అడిగాడు. అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడి వైపున కూర్చొని ఉండడం మరియు ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు. అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు.

షేర్ చేయి
Read మార్కు 14

మార్కు 14:32-64 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు. అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు. ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి, ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా? మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు. ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు. మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు. వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.” ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి. ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు. అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికి వేశాడు. యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా? నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది.” అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు. కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు. ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు. చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ, “ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు. కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు. అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు. ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు.

షేర్ చేయి
Read మార్కు 14

మార్కు 14:32-64 పవిత్ర బైబిల్ (TERV)

అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు. కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం, ఆవేదన కలగటం మొదలుపెట్టింది. ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే “ఆ ఘడియ” రాకూడదని ప్రార్థిస్తూ, ఆయన, “ అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా? మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు. యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు. ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు. యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు. లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు. ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు. వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు. వచ్చిన ప్రజలు యేసును బంధించారు. యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు. యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు. అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు. ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని, అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు. వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు. ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు. చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు: “‘మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.” కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు. ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు. కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు. యేసు, “ఔను, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు. ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు? అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు. అందరూ మరణదండన విధించాలని అన్నారు.

షేర్ చేయి
Read మార్కు 14

మార్కు 14:32-64 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన– నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరం భించెను అప్పుడాయన–నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు –నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి–సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ యైనను మేలుకొనియుండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు. ఆయన మూడవ సారి వచ్చి–మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను. వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి. ఆయనను అప్పగించువాడు – నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి–బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా వారు ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు–మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను). అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను. ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు. అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి–ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు–పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధానయాజకుడు తన వస్ర్తములు చింపుకొని–మనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచు చున్నదని అడుగగా వారందరు–మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి.

షేర్ చేయి
Read మార్కు 14