తర్వాత వారు గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అన్నారు. ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని పోయి, తీవ్ర వేదనతో బాధపడసాగారు. ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ప్రాణం దుఃఖంతో నిండి ఉంది, కనుక మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి” అని చెప్పారు.
ఆయన కొంత ముందుకు వెళ్లి, నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటి పోవాలని ప్రార్థించారు. ఆయన, “అబ్బా, తండ్రీ, నీకు సమస్తం సాధ్యమే. ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, మీ చిత్తమే జరగాలి” అన్నారు.
ఆయన తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “సీమోనూ, నిద్రిస్తున్నావా? ఒక గంటయైనా మెలకువగా ఉండలేక పోయావా? మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం.” అని చెప్పారు.
ఆయన మళ్ళీ వెళ్లి అదే విధంగా ప్రార్థించారు. ఆయన తిరిగి వచ్చినపుడు, వారి కళ్ళు బరువుగా ఉన్నాయి, కనుక వారు మళ్ళీ నిద్రపోతున్నారని తెలుసుకున్నారు. ఆయనకు ఏమి చెప్పాలో వారికి తెలియలేదు.
యేసు మూడవసారి తిరిగి వచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇక చాలు! చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. లేవండి! మనం వెళ్దాం. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకొని వచ్చింది.
ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు: “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించి బందోబస్తుతో తీసుకొనివెళ్ళండి.” యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. వారు వచ్చి యేసును పట్టుకొని, బంధించారు. యేసు ప్రక్కన నిలుచున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి చెవిని నరికివేసాడు.
యేసు, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతి రోజు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, మీతోనే ఉన్నాను, మీరు నన్ను బంధించలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలని ఇలా జరిగింది” అని చెప్పారు. అప్పుడు అందరు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోయారు.
సన్నని నార వస్త్రం మాత్రమే ధరించిన ఒక యువకుడు, యేసును వెంబడిస్తున్నాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు, అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు.
వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కాపలా కాస్తున్న వారితో చలిమంట దగ్గర కూర్చొని, చలి కాచుకుంటున్నాడు.
ముఖ్య యాజకులు మరియు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు. ఆయనకు వ్యతిరేకంగా అనేకులు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, కాని వాటిలో ఒకదానికొకటి సరిపోలేదు.
అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా ఈ అబద్ధ సాక్ష్యం చెప్పారు: “ ‘ఇతడు మనుష్యుల చేతులతో కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో మనుష్యుల చేతులతో కట్టని మరొక దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు.
అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి యేసును, “నీవు వారికి సమాధానం ఇవ్వవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న సాక్ష్యాల గురించి నీవు ఏమంటావు?” అని అడిగాడు. కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు.
ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?” అని అడిగాడు.
అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడి వైపున కూర్చొని ఉండడం మరియు ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు.
అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు.
అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు.