మార్కు 14:12-42
మార్కు 14:12-42 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమునవారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు–నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన –మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి–నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన – పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను. వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన –ఇది నిబంధనవిషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి. అప్పుడు యేసు వారిని చూచి–మీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా. అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లెదననెను. అందుకు పేతురు– అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి– నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అతడు మరి ఖండితముగా–నేను నీతోకూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన– నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరం భించెను అప్పుడాయన–నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు –నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి–సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ యైనను మేలుకొనియుండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు. ఆయన మూడవ సారి వచ్చి–మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను.
మార్కు 14:12-42 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, అది ఆచార ప్రకారం పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం, యేసు శిష్యులు ఆయనతో, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు. యేసు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, వారితో ఈ విధంగా అన్నారు, “మీరు పట్టణంలోనికి వెళ్లినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, మీరు అతన్ని వెంబడించండి. అతడు ప్రవేశించే ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, నా అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. అతడు అన్ని సదుపాయాలతో, సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు. శిష్యులు పట్టణంలోనికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొన్నారు. కాబట్టి అక్కడ వారు పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు. సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండుమంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. వారంతా బల్ల దగ్గర కూర్చుని తింటున్నప్పుడు, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు నాతో పాటు భోజనం చేస్తున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు. వారికి దుఃఖం కలిగింది, ఒకరి తర్వాత ఒకరు ఆయనతో, “ఖచ్చితంగా నేనైతే కాదు కదా?” అన్నారు. అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో పాటు రొట్టెను గిన్నెలో ముంచేవాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు. ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు. యేసు వారితో, “ఇది అనేకుల కోసం చిందించనున్న నా నిబంధన రక్తము. దేవుని రాజ్యంలో నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగనని మీతో చెప్తున్నాను” అన్నారు. వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు. యేసు వారితో, “మీరందరు చెదరిపోతారు, ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి.’ కాని నేను తిరిగి లేచిన తర్వాత మీకంటే ముందు గలిలయ ప్రాంతానికి వెళ్తాను” అని చెప్పారు. అప్పుడు పేతురు ఆయనతో, “అందరు నిన్ను విడిచినా, నేను విడువను” అన్నాడు. అందుకు యేసు, “ఈ రాత్రే కోడి రెండు సార్లు కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. కాని పేతురు నొక్కి చెప్తూ, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులు కూడా అలాగే అన్నారు. తర్వాత వారు గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థనచేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని అన్నారు. ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని పోయి, తీవ్ర వేదనతో బాధపడసాగారు. ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి” అని చెప్పారు. ఆయన కొంత దూరం వెళ్లి, నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటి పోవాలని ప్రార్థించారు. ఆయన, “అబ్బా, తండ్రీ, నీకు సమస్తం సాధ్యమే. ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, మీ చిత్తమే జరగాలి” అన్నారు. ఆయన తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “సీమోనూ, నిద్రిస్తున్నావా? ఒక గంటయైనా మెలకువగా ఉండలేవా? మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు. ఆయన మళ్ళీ వెళ్లి అదే విధంగా ప్రార్థించారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్లు బరువుగా ఉన్నాయి, కాబట్టి వారు మళ్ళీ నిద్రపోతున్నారని తెలుసుకున్నారు. ఆయనకు ఏమి చెప్పాలో వారికి తెలియలేదు. యేసు మూడవసారి తిరిగివచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇక చాలు! చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
మార్కు 14:12-42 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు. యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి. అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు. ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు. సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అన్నాడు. వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరవాత ఒకరు ఆయనతో, “నేను కాదు కదా!” అన్నారు. ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే! ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది” అన్నాడు. వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు. తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు. ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు. అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు. అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’ కాని నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అని చెప్పాడు. అయితే పేతురు ఆయనతో, “అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచి పెట్టను” అన్నాడు. అప్పుడు యేసు, “నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు” అని అతనితో అన్నాడు. “నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను” అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు. అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు. అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు. ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి, ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా? మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు. ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు. మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు. వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.”
మార్కు 14:12-42 పవిత్ర బైబిల్ (TERV)
పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు. యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి. అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి. అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.” శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు. సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు. వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు. యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు. అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు. ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు. “ఇది నా నిబంధన రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను. ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు. వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్ళారు. యేసు వాళ్ళతో, “మీ మనస్సులు చెదరి పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో, ‘నేను గొఱ్ఱెల కాపరిని కొడతాను! గొఱ్ఱెలన్నీచెదరిపోతాయి!’ అని వ్రాయబడింది. కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని అన్నాడు. అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు. యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు. కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు. అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు. కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం, ఆవేదన కలగటం మొదలుపెట్టింది. ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే “ఆ ఘడియ” రాకూడదని ప్రార్థిస్తూ, ఆయన, “ అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా? మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు. యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు. ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు. యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు. లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు.