మార్కు 14:12-42

మార్కు 14:12-42 IRVTEL

పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు. యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి. అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు. ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు. సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అన్నాడు. వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరవాత ఒకరు ఆయనతో, “నేను కాదు కదా!” అన్నారు. ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే! ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది” అన్నాడు. వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు. తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు. ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు. అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు. అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’ కాని నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అని చెప్పాడు. అయితే పేతురు ఆయనతో, “అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచి పెట్టను” అన్నాడు. అప్పుడు యేసు, “నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు” అని అతనితో అన్నాడు. “నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను” అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు. అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు. అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు. ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి, ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా? మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు. ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు. మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు. వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.”