మార్కు 12:13-44
మార్కు 12:13-44 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తర్వాత వారు యేసును ఆయన మాటల్లోనే పట్టించాలని కొంతమంది పరిసయ్యులను హేరోదీయులను ఆయన దగ్గరకు పంపారు. వారు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు; కాని సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” మేము పన్ను కట్టాలా దగ్గరా? అని అడిగారు. అయితే యేసు వారి వేషధారణ తెలిసినవాడై, “మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? నా దగ్గరకు ఒక దేనారం తీసుకురండి, నేను దాన్ని చూస్తాను” అన్నారు. వారు ఒక నాణెం తెచ్చారు, ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు యేసు, “కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. ఆయన జవాబుకు వారు చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు. అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. కాబట్టి రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, కాని వాడు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు. అలాగే మూడవ వానికి కూడా జరిగింది. వాస్తవానికి, ఆ ఏడుగురు కూడా సంతానం లేకుండానే చనిపోయారు. చివరికి, ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు చేయట్లేదా? చనిపోయినవారు తిరిగి బ్రతికిన తర్వాత వారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు; వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. మృతులు తిరిగి లేచే విషయం మోషే వ్రాసిన గ్రంథంలో, మండుతున్న పొద సంఘటనలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ‘నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను’ అని చెప్పడం మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు. మీరు ఘోరంగా పొరబడుతున్నారు” అన్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుకోవడం విన్నాడు. యేసు వారికి మంచి జవాబు ఇవ్వడం గమనించి, “ఆజ్ఞలన్నిటిలో అతి ముఖ్యమైనదేది?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “అన్నిటిలో అతి ముఖ్యమైనది: ‘ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన ప్రభువైన దేవుడు, ప్రభువు ఒక్కరే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’ రెండవ ఆజ్ఞ: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ వీటిని మించిన గొప్ప ఆజ్ఞ లేదు” అని అతనితో చెప్పారు. అతడు, “బోధకుడా, బాగా చెప్పావు. దేవుడు ఒక్కరే, ఆయన తప్ప వేరొకరు లేరని నీవు చెప్పింది నిజమే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణవివేకంతో, మీ పూర్ణబలంతో ఆయనను ప్రేమించాలి, మీకులా మీ పొరుగువారిని ప్రేమించడం దహనబలులు అర్పణల కంటే ముఖ్యం” అని జవాబిచ్చాడు. అతడు తెలివిగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అని అతనితో చెప్పారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు. యేసు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు? దావీదు తానే, పరిశుద్ధాత్మతో నింపబడి ఈ విధంగా మాట్లాడాడు: “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’ దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు. ఆ పెద్ద జనసమూహం అంతా సంతోషంగా ఆయన మాటలను విన్నారు. యేసు బోధిస్తూ, “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తపడండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు. వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు. యేసు దేవాలయంలో కానుకలపెట్టె ముందు కూర్చుని జనసమూహం ఆ కానుక పెట్టెలో వారి డబ్బులు వేయడం గమనిస్తున్నారు. చాలామంది ధనవంతులు డబ్బు మూటలను అందులో వేస్తున్నారు. కాని ఒక బీద విధవరాలు వచ్చి రెండు చిన్న కాసులను ఆ పెట్టెలో వేసింది. యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “నేను మీతో నిజంగా చెప్తున్న, కానుక పెట్టెలో అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు, కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.
మార్కు 12:13-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు. వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు. అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు. “బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకుని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు. ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది. ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకున్నారు కదా!” అని అడిగారు. యేసు వారికి జవాబిస్తూ, “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు. చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు. తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు. ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఆయనను అడిగాడు. అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు. ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే. పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు. అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు? దావీదు, తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు, నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో’ అన్నాడు. దావీదు స్వయంగా ఆయనను ‘ప్రభువు’ అని పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు?” అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు. ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ, సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు. వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.” యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది. ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.
మార్కు 12:13-44 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని హేరోదు రాజు పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా?” అని అడిగారు. యేసుకు వాళ్ళ కుట్ర తెలిసి పోయింది. “నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనారా యివ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి” అని అన్నాడు. వాళ్ళు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు. ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.” శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్య మైనది?” అని యేసును అడిగాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు, రెండవది ఇది: నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.” ఆ శాస్త్రి, “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకొన్నంతగా, తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా ముఖ్యమైనవి” అని అన్నాడు. అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు. యేసు మందిరంలో బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకంటున్నారు? దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువు, నా ప్రభువుతో ఈ విధంగా అన్నాడు: నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసేవరకు నా కుడిచేతి వైపు కూర్చొనుము.’ దావీదు స్వయంగా ఆయన్ని, ‘ప్రభూ!’ అని పిలిచాడు కదా! మరి అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అక్కడున్న ప్రజలగుంపు అత్యానందంగా ఆయన మాటలు విన్నారు. యేసు యింకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు. వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు. వాళ్ళు వితంతువుల యిండ్లను దోచుకుంటూ, పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు అతితీవ్రంగా శిక్షిస్తాడు.” ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు. కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది. యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.
మార్కు 12:13-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి–బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ని చ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి–మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి, ఆయన–ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారు–కైసరువి అనిరి. అందుకు యేసు – కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి –బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను,వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్ర్తీ యు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి. అందుకు యేసు–మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు. వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు. వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు–నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడు చున్నారని వారితో చెప్పెను. శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి–ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు . నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి–బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి–నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా –క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను. దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు విధవరాండ్ర యిండ్లు దిగమ్రిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.