మార్కు సువార్త 12
12
కౌలుదారుల ఉపమానం
1యేసు వారితో ఉపమానరీతిలో మాట్లాడడం ప్రారంభించారు: “ఒక వ్యక్తి తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు. 2కోతకాలం వచ్చినప్పుడు అతడు ఆ ద్రాక్షతోటకు వెళ్లి దానిలోని తన భాగం తెమ్మని ఒక పనివానిని ఆ రైతుల దగ్గరకు పంపాడు, 3కాని ఆ రైతులు వానిని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. 4అప్పుడు అతడు మరొక పనివానిని వారి దగ్గరకు పంపాడు కాని, వారు వాన్ని తలమీద కొట్టి అవమానించి పంపేశారు. 5అప్పుడు అతడు మరొక పనివానిని పంపాడు, వారు అతన్ని కూడ చంపేశారు. అలా అతడు చాలామంది పనివారిని పంపాడు, వారు కొంతమందిని కొట్టారు, మరికొందరిని చంపారు.
6“పంపడానికి అతని దగ్గర ఒకడే మిగిలాడు, తాను ఎంతో ప్రేమించే, తన కుమారుడు. ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, చివరిగా అతన్ని పంపాడు.
7“కాని వారు ఒకరితో ఒకరు, ‘ఇతడే వారసుడు, రండి, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని అనుకున్నారు. 8కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.
9“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు. 10మీరు ఈ లేఖనం చదువలేదా:
“ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి
మూలరాయి అయ్యింది;
11ఇది ప్రభువే చేశారు,
ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’#12:11 కీర్తన 118:22-23”
12ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి ఎలాగైనా ఆయనను బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని వారు ప్రజలకు భయపడి ఆయనను వదిలి వెళ్లిపోయారు.
కైసరుకు పన్ను చెల్లించుట
13తర్వాత వారు యేసును ఆయన మాటల్లోనే పట్టించాలని కొంతమంది పరిసయ్యులను హేరోదీయులను ఆయన దగ్గరకు పంపారు. 14వారు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు; కాని సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” 15మేము పన్ను కట్టాలా దగ్గరా? అని అడిగారు.
అయితే యేసు వారి వేషధారణ తెలిసినవాడై, “మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? నా దగ్గరకు ఒక దేనారం తీసుకురండి, నేను దాన్ని చూస్తాను” అన్నారు. 16వారు ఒక నాణెం తెచ్చారు, ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు.
వారు, “కైసరువి” అన్నారు.
17అప్పుడు యేసు, “కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.
ఆయన జవాబుకు వారు చాలా ఆశ్చర్యపడ్డారు.
పునరుత్థానంలో పెళ్ళి
18అప్పుడు పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. 19“బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు. 20అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. 21కాబట్టి రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, కాని వాడు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు. అలాగే మూడవ వానికి కూడా జరిగింది. 22వాస్తవానికి, ఆ ఏడుగురు కూడా సంతానం లేకుండానే చనిపోయారు. చివరికి, ఆ స్త్రీ కూడా చనిపోయింది. 23ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు.
24అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు చేయట్లేదా? 25చనిపోయినవారు తిరిగి బ్రతికిన తర్వాత వారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు; వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. 26మృతులు తిరిగి లేచే విషయం మోషే వ్రాసిన గ్రంథంలో, మండుతున్న పొద సంఘటనలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ‘నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను’#12:26 నిర్గమ 3:6 అని చెప్పడం మీరు చదువలేదా? 27ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు. మీరు ఘోరంగా పొరబడుతున్నారు” అన్నారు.
గొప్ప ఆజ్ఞ
28ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుకోవడం విన్నాడు. యేసు వారికి మంచి జవాబు ఇవ్వడం గమనించి, “ఆజ్ఞలన్నిటిలో అతి ముఖ్యమైనదేది?” అని ఆయనను అడిగాడు.
29అందుకు యేసు, “అన్నిటిలో అతి ముఖ్యమైనది: ‘ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన ప్రభువైన దేవుడు, ప్రభువు ఒక్కరే. 30మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’#12:30 ద్వితీ 6:4,5 31రెండవ ఆజ్ఞ: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’#12:31 లేవీ 19:18 వీటిని మించిన గొప్ప ఆజ్ఞ లేదు” అని అతనితో చెప్పారు.
32అతడు, “బోధకుడా, బాగా చెప్పావు. దేవుడు ఒక్కరే, ఆయన తప్ప వేరొకరు లేరని నీవు చెప్పింది నిజమే. 33మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణవివేకంతో, మీ పూర్ణబలంతో ఆయనను ప్రేమించాలి, మీకులా మీ పొరుగువారిని ప్రేమించడం దహనబలులు అర్పణల కంటే ముఖ్యం” అని జవాబిచ్చాడు.
34అతడు తెలివిగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అని అతనితో చెప్పారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.
క్రీస్తు ఎవరి కుమారుడు?
35యేసు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు? 36దావీదు తానే, పరిశుద్ధాత్మతో నింపబడి ఈ విధంగా మాట్లాడాడు:
“ ‘నేను నీ శత్రువులను
నీకు పాదపీఠంగా చేసే వరకు
“నీవు నా కుడి వైపున కూర్చోమని
ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’#12:36 కీర్తన 110:1
37దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు.
ఆ పెద్ద జనసమూహం అంతా సంతోషంగా ఆయన మాటలను విన్నారు.
ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి హెచ్చరిక
38యేసు బోధిస్తూ, “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తపడండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. 39వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు. 40వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.
విధవరాలి కానుక
41యేసు దేవాలయంలో కానుకలపెట్టె ముందు కూర్చుని జనసమూహం ఆ కానుక పెట్టెలో వారి డబ్బులు వేయడం గమనిస్తున్నారు. చాలామంది ధనవంతులు డబ్బు మూటలను అందులో వేస్తున్నారు. 42కాని ఒక బీద విధవరాలు వచ్చి రెండు చిన్న కాసులను ఆ పెట్టెలో వేసింది.
43యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “నేను మీతో నిజంగా చెప్తున్న, కానుక పెట్టెలో అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. 44వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు, కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
మార్కు సువార్త 12: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.