మార్కు 1:2-9
మార్కు 1:2-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు. మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మముపొందెను.
మార్కు 1:2-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లుగా: “ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.” “అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం, ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కొరకు త్రోవలను సరాళం చేయండి’ ” అని చెప్తుంది. అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ప్రత్యక్షమై, పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండి అని ప్రకటిస్తున్నాడు. యూదయ గ్రామీణ ప్రాంతమంతా, యెరూషలేము ప్రజలందరూ అతని దగ్గరకు వెళ్లారు. వారు తమ పాపాలను ఒప్పుకొంటూ, యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించుకొని, నడుముకు తోలుదట్టీని కట్టుకొని మిడతలు, అడవి తేనె తినేవాడు. అతడిచ్చిన సందేశమిది: “నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారు.” ఆ సమయంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందారు.
మార్కు 1:2-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. ‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.” యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం. యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు. “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు. యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
మార్కు 1:2-9 పవిత్ర బైబిల్ (TERV)
యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను, ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.” “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము, అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’ అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.” కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.” ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు.