మార్కు 1:1-45

మార్కు 1:1-45 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

దేవుని కుమారుడైన క్రీస్తు యేసును గురించిన సువార్త ప్రారంభం. యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లుగా: “ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.” “అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం, ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కొరకు త్రోవలను సరాళం చేయండి’ ” అని చెప్తుంది. అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ప్రత్యక్షమై, పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండి అని ప్రకటిస్తున్నాడు. యూదయ గ్రామీణ ప్రాంతమంతా, యెరూషలేము ప్రజలందరూ అతని దగ్గరకు వెళ్లారు. వారు తమ పాపాలను ఒప్పుకొంటూ, యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించుకొని, నడుముకు తోలుదట్టీని కట్టుకొని మిడతలు, అడవి తేనె తినేవాడు. అతడిచ్చిన సందేశమిది: “నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారు.” ఆ సమయంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందారు. యేసు నీటిలో నుండి బయటకు వస్తుండగా, ఆకాశం చీలి దేవుని ఆత్మ పావురంలాగ ఆయన మీదికి దిగి రావడం అతడు చూసాడు. అంతేకాక పరలోకం నుండి ఒక స్వరం: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది. వెంటనే ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకొని వెళ్లాడు, ఆయన సాతాను చేత శోధించబడుతూ, నలభై రోజులు అరణ్యంలో ఉన్నారు. అడవి మృగాల మధ్య ఆయన ఉన్నాడు, దేవదూతలు ఆయనకు సేవ చేశారు. యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, యేసు దేవుని సువార్తను ప్రకటిస్తూ, గలిలయకు వెళ్లారు. ఆయన, “కాలము పూర్తయింది. దేవుని రాజ్యం సమీపించింది. పశ్చాత్తాపపడండి, సువార్తను నమ్మండి!” అని చెప్పారు. యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు, సీమోను అతని సోదరుడు అంద్రెయ సముద్రంలో వల వేయడం ఆయన చూసారు, వారు జాలరులు. యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్లినప్పుడు, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను పడవలో ఉండి, తమ వలలను సిద్ధం చేసుకోవడం ఆయన చూసారు వెంటనే ఆయన వారిని పిలిచారు, వారు ఆలస్యం చేయకుండ తమ తండ్రియైన జెబెదయిని పనివారితో పాటు పడవలో విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వారు కపెర్నహూముకు వెళ్లారు, మరియు సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా కాక, ఒక అధికారం కలవానిగా వారికి బోధించారు. అంతలో వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు, “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు!” అని బిగ్గరగా కేకలు వేసాడు. అందుకు యేసు కఠినంగా, “మాట్లాడకు!” అని, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ వానిని బలంగా కుదిపి పెద్ద కేకలు వేసి వానిలో నుండి బయటకు వచ్చేసింది. ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఇదేంటి? అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధ! ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుతున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఇలా ఆయనను గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది. వారు సమాజమందిరం నుండి బయటకు రాగానే, వారు యాకోబు మరియు యోహానుతో కలిసి అంద్రెయ, సీమోనుల ఇంటికి వెళ్లారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. కనుక ఆయన ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకొని లేవనెత్తారు. జ్వరం ఆమెను వదలిపోయింది అప్పుడు ఆమె వారికి పరిచారం చేయడం మొదలు పెట్టింది. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు రోగాలు గలవారినందరిని మరియు దయ్యాలు పట్టినవారిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. పట్టణస్థులందరు ఆ ఇంటి ద్వారం దగ్గర కూడుకొన్నారు, వివిధ రోగాలు గల అనేకులను యేసు స్వస్థపరిచారు. ఆయన అనేక దయ్యాలను వెళ్లగొట్టారు, అయితే ఆ దయ్యాలకు తాను ఎవరో తెలుసు, కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. చాలా ప్రొద్దున, ఇంకా చీకటిగా ఉండగానే యేసు నిద్రలేచి, ఇంటి నుండి బయలుదేరి తాను ప్రార్థించే ఏకాంత స్థలానికి వెళ్లారు. సీమోను, అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్లి, ఆయనను కనుగొని, “అందరు నీ కొరకు వెదకుతున్నారు!” అని చెప్పారు. అందుకు యేసు, “మనం దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్దాం రండి, అప్పుడు నేను అక్కడ కూడా ప్రకటించగలను, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అని వారితో చెప్పారు. కనుక ఆయన గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాలలో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్లగొడుతూ ఉన్నారు. కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి, “నీకిష్టమైతే, నన్ను శుద్ధునిగా చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు వాని మీద కనికరపడ్డారు. ఆయన తన చేయి చాపి వాన్ని ముట్టారు. వానితో, “నాకు ఇష్టమే, శుద్ధుడవు అవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వానిని వదలిపోయి వాడు శుద్ధుడయ్యాడు. వెంటనే యేసు: “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా నీ శుద్ధీకరణ కొరకు మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని హెచ్చరించి వానిని పంపివేసారు. కాని వాడు వెళ్లి ఈ విషయాన్ని అందరితో చెప్తూ, ఆ వార్తను వ్యాపింపచేశాడు. దాని ఫలితంగా యేసు ఆ పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక ఎవరు నివసించని బయటి ప్రదేశాలలో ఉన్నారు. అయినాసరే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆయన దగ్గరకు వస్తూనే ఉన్నారు.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:1-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. ‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.” యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం. యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు. “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు. యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.” వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు. యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు. ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు. యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు. వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు. తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు. ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది. సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది. సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు. ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు. కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:1-45 పవిత్ర బైబిల్ (TERV)

దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గురించి సువార్త ప్రారంభం. యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను, ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.” “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము, అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’ అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.” కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.” ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని అన్నది. వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసారు. యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు. యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు. యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు. అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు. వాడు, “నజరేయుడవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నాడు. యేసు, “నోరుమూసుకో వాని నుండి బయటకు రా!” అని గద్దిస్తూ అన్నాడు. ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది. ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, “ఇదేమిటి? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తున్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడుకున్నారు. గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి ఆయన గురించి తెలిసిపోయింది. వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్ళారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు పరిచర్యలు చెయ్యటం మొదలు పెట్టింది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆ ఊరంతా ఆయనవున్న యింటిముందు చేరుకుంది. రకరకాల వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ప్రార్థించాడు. సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు. ఆయన్ని చూసి వాళ్ళు, “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు. యేసు సమాధానం చెబుతూ, “ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” అని అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు. ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, “మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు” అని వేడుకున్నాడు. యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే దయ చూపుతాను!” అని అంటూ అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది. అతణ్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు. కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకొ” అని గట్టిగా చెప్పాడు. కాని అతడు వెళ్ళి అందరికి చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేక పొయ్యాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేసాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:1-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. –ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు. మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మముపొందెను. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు–నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు –కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపెట్టిన మనుష్యుడొకడుండెను. వాడు–నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. అందరును విస్మయమొంది – ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను. వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపెట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పెట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి; పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను. ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితోకూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, –అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను. ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన–ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:1-45

మార్కు 1:1-45 TELUBSI