మత్తయి 8:1-27

మత్తయి 8:1-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. కుష్ఠురోగంతో ఉన్న ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఆయనతో, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను శుద్ధునిగా చేయి” అన్నాడు. యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు అవు!” అన్నారు. వెంటనే వాడు తన కుష్ఠురోగం నుండి శుద్ధుడయ్యాడు. అప్పుడు యేసు వానితో, “నీవు ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని, వారికి సాక్ష్యంగా ఉండేలా, మోషే నియమించిన కానుకను అర్పించు” అని వానికి చెప్పారు. యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో చాలా బాధపడుతున్నాడు” అని సహాయాన్ని కోరాడు. యేసు అతనితో, “నేను వచ్చి అతన్ని స్వస్థపరచనా?” అన్నాడు. అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు. ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే, నా క్రింద సైనికులున్నారు. ఒకడిని ‘వెళ్లు’ అంటే వెళ్తాడు, ‘రా’ అంటే వస్తాడు. నా దాసుని ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి తనను వెంబడిస్తున్న వారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో నిజంగా చెప్తున్నాను. అనేకులు తూర్పు, పడమర నుండి వచ్చి, పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోనికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.” అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు! నీవు నమ్మినట్లే నీకు జరుగును” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు స్వస్థపడ్డాడు. తర్వాత యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు, పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండడం చూసారు. ఆయన ఆమె చెయ్యిని ముట్టగానే జ్వరం ఆమెను వదలిపోయింది, ఆమె లేచి ఆయనకు పరిచారం చేయడం మొదలు పెట్టింది. సాయంకాలమైనప్పుడు, దయ్యాలు పట్టిన చాలామందిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన ఒక్కమాటతో ఆ దయ్యాలను వెళ్లగొట్టి, రోగులందరిని స్వస్థపరిచారు. యెషయా ప్రవక్త ద్వారా పలుకబడిన ఈ మాటలు నెరవేరేలా ఇలా జరిగింది: “ఆయన మన బలహీనతలను తీసుకొని, మన వ్యాధులను భరించారు.” యేసు తన చుట్టు ఉన్న జనసమూహాన్ని చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దాం అని ఆదేశించారు. అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో, “బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అన్నాడు. అందుకు యేసు, “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి కనీసం తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనికి జవాబిచ్చారు. ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతి పెట్టడానికి నన్ను వెళ్లనివ్వు” అని అన్నాడు. అయితే యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకొంటారు నీవైతే నన్ను వెంబడించు” అన్నారు. ఆ తర్వాత యేసు పడవ ఎక్కారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. అప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాను తీవ్రంగా చెలరేగి అలలు ఆ పడవ మీద పడ్డాయి. అయితే యేసు నిద్రపోతున్నారు. శిష్యులు వెళ్లి, “ప్రభువా, మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని కాపాడు” అంటూ ఆయనను లేపారు. అందుకు ఆయన “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలులను, అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది. వారందరు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.

షేర్ చేయి
Read మత్తయి 8

మత్తయి 8:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు. ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది. అప్పుడు యేసు అతనితో, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు” అని చెప్పాడు. యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను. తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు. అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.” యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు. తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు. యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది. సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, “ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు. మన రోగాలను భరించాడు.” యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు. అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు. ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు. అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు. ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు. అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.

షేర్ చేయి
Read మత్తయి 8

మత్తయి 8:1-27 పవిత్ర బైబిల్ (TERV)

యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు. యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు. యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ, “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు. యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు. కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.” ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది. యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు. ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చెయ్యటం మొదలుపెట్టింది. ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది: “మన రోగాల్ని ఆయన తనపై వేసుకొన్నాడు. మన బాధల్ని ఆయన అనుభవించాడు.” యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు. యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు. మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు. యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు. యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు. యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి. వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు.

షేర్ చేయి
Read మత్తయి 8

మత్తయి 8:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి–ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి–నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి యాయెను. అప్పుడు యేసు–ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి –ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు –నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి–ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి–ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతోకూడను, ఇస్సాకుతోకూడను, యాకోబుతోకూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాననెను. అంతట యేసు – ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మాటవలన దయ్యములను వెళ్ల గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీ వెక్కడికి వెళ్లినను నీ వెంటవచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్లి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి–నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి– ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.

షేర్ చేయి
Read మత్తయి 8