మత్తయి 8

8
1ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. 2ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి–ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. 3అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి–నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి యాయెను. 4అప్పుడు యేసు–ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.
5ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి 6–ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. 7యేసు –నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా 8ఆ శతాధిపతి–ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 9నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను. 10యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి–ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 11అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతోకూడను, ఇస్సాకుతోకూడను, యాకోబుతోకూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని 12రాజ్య సంబంధులు#8:12 మూలభాషలో–రాజ్యకుమారులు. వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాననెను. 13అంతట యేసు – ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.
14తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి 15ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. 16సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 17ఆయన మాటవలన దయ్యములను వెళ్ల గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
18యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. 19అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీ వెక్కడికి వెళ్లినను నీ వెంటవచ్చెదనని ఆయనతో చెప్పెను. 20అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను. 21శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్లి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా 22యేసు అతని చూచి–నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.
23ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. 24అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా 25వారు ఆయన యొద్దకు వచ్చి– ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. 26అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. 27ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
28ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలోనుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను. 29వారు–ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి. 30వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా 31ఆ దయ్యములు –నీవు మమ్మును వెళ్లగొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. 32ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను. 33వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పెట్టినవారి సంగతియు తెలిపిరి. 34ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మత్తయి 8: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in