మత్తయి 5:1-17
మత్తయి 5:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా బోధించారు: “ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు. కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. “నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు. “మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే అది తిరిగి సారవంతం కాగలదా? ఇక అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. “మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండమీద కట్టబడిన పట్టణం కనపడకుండా ఉండలేదు. అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. “నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు.
మత్తయి 5:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు. “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే. దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది. సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు. కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు. “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు. ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.
మత్తయి 5:1-17 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు: “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు. కనుక వాళ్ళు ధన్యులు. నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు. శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు. నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు. “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు. “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను.
మత్తయి 5:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను– ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
మత్తయి 5:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)