మత్తయిత 5:1-17

మత్తయిత 5:1-17 TERV

యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు: “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు. కనుక వాళ్ళు ధన్యులు. నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు. శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు. నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు. “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు. “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను.