మత్తయి 27:35-66
మత్తయి 27:35-66 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు. ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు. ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము. వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు. ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, “నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు?” అని అర్థము. అక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు ఆ మాట విని, “ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని వెళ్లి ఒక స్పంజీని తెచ్చాడు. దాన్ని ఆ చేదు చిరకలో ముంచి, కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. మిగిలిన వారు, “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి. యేసు లేచిన తర్వాత వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి, పరిశుద్ధ పట్టణంలో చాలామందికి కనిపించారు. శతాధిపతి అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు దూరంగా నిలబడి చూస్తున్నారు. వారు యేసుకు సపర్యలు చేస్తూ గలిలయ నుండి ఆయనను వెంబడించారు. వారిలో మగ్దలేనే మరియ, యాకోబు యోసేపుల తల్లియైన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు. సాయంకాలం అవుతున్నప్పుడు, తనకు తానే యేసు శిష్యునిగా మారిన, అరిమతయికు చెందిన యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు. అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు, అందుకు పిలాతు దానిని అతనికి అప్పగించమని ఆదేశించాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకుని, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తన కోసం రాతిలో తొలిపించుకొన్న క్రొత్త సమాధిలో దానిని పెట్టాడు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయాడు. మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే ఆ సమాధి ఎదుట కూర్చుని ఉన్నారు. మరుసటిరోజు, అనగా సిద్ధపరచే దినానికి తర్వాత రోజు, ముఖ్య యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వెళ్లారు. వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయడానికి ఆదేశించండి. లేకపోతే, అతని శిష్యులు వచ్చి వాని శరీరాన్ని ఎత్తుకుపోయి, అతడు మృతులలో నుండి లేచాడని ప్రజలతో చెప్పవచ్చు. అప్పుడు మొదటి మోసం కంటే కడపటి మోసం మరి విపరీతంగా ఉంటుంది” అని చెప్పారు. అందుకు పిలాతు, “కావలివారిని తీసుకోండి, మీరు వెళ్లి, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి” అని వారితో చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు.
మత్తయి 27:35-66 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు. మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు. రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు. యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసేపు అనే వారి తల్లి అయిన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు. ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు. అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు. తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు. మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి, “అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి మూడవ రోజు వరకూ సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి ‘ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు’ అని ప్రజల్లో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచన కంటే చివరి వంచన మరింత చెడ్డదౌతుంది” అన్నారు. అందుకు పిలాతు, “కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి” అని వారితో చెప్పాడు. వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.
మత్తయి 27:35-66 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు. సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు. ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు. ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమ వైపు సిలువకు వేసారు. ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు. ప్రధానయాజకులు శాస్త్రులతో, పెద్దలతో కలసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ, “అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము. అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” అని కేక వేసాడు. అంటే, “నా దైవమా! నా దైవమా! నన్నెందుకు ఒంటరిగా ఒదిలివేసావు?” అని అర్థం. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. ఒకడు వెంటనే పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక స్పాంజి తెచ్చాడు. దాన్ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు త్రాగటానికి యిచ్చాడు. కాని యితర్లు, “ఆగండి! అతణ్ణి రక్షించటానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!” అని అన్నారు. యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన ప్రాణం వదిలి వేసాడు. అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది దాకా చినిగి పోయింది. భూకంపం వచ్చి బండలు పగిలి పొయ్యాయి. సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు. వాళ్ళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు. యేసును కాపలా కాస్తున్న శతాధిపతి, సైనికులు భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటల్ని చూసి చాలా భయపడిపోయి, “ఈయన నిజంగా దేవుని కుమారుడే!” అని అన్నారు. చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చెయ్యటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చినవాళ్ళు. వాళ్ళలో మగ్దలేనే గ్రామస్తురాలైన మరియ, యాకోబు, యోసేపు అనువారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు. సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు. అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు. ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు. మగ్దలేనే మరియ, యింకొక మరియ ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని ఉన్నారు. అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు, “అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా ‘మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను’ అని అనటం మాకు జ్ఞాపకం ఉంది. అందువల్ల మూడవ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చెయ్యకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి, ‘అతడు బ్రతికాడు’ అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది” అని అన్నారు. పిలాతు, “భటుల్ని తీసుకు వెళ్ళండి. వాళ్ళు సమాధిని జాగ్రత్తగా కాపలా కాయటం మీ బాధ్యత” అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు.
మత్తయి 27:35-66 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. –ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతోకూడ సిలువవేయ బడిరి. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్నవారిలో కొందరామాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొనిపోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; తక్కినవారు–ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధి పతియు అతనితోకూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరి యయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి –అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞా పించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి –ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదు రేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు–కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
మత్తయి 27:35-66 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)