మత్తయి 26:47-75
మత్తయి 26:47-75 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు ప్రజానాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది. ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి” యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా, నీకు శుభం” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు. అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేశాడు. యేసు వానితో, “నీ కత్తిని దాని ఒరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే, ఆయన పన్నెండు దళాల సైన్యం కంటే ఎక్కువ మంది దూతలను వెంటనే నాకు పంపడని అనుకున్నావా? కాని, ఈ విధంగా జరగాలని లేఖనాల్లో చెప్పబడినవి ఎలా నెరవేరుతాయి?” అని అన్నారు. ఆ సమయంలోనే యేసు ఆ గుంపుతో, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు, మీరు నన్ను బంధించలేదు. అయితే ప్రవక్తలు వ్రాసిన లేఖనాలు నెరవేరడానికే ఈ విధంగా జరిగింది” అని చెప్పారు. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయారు. యేసును బంధించినవారు ఆయనను ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదా నాయకులు సమావేశమై ఉన్నారు. అయితే పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. లోపల ఏమి జరుగుతుందో చూడాలని అక్కడే సైనికులతో కూర్చున్నాడు. ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు. చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు. చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు. వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.” అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు. అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు. అందుకు యేసు, “నీవు చెప్పినట్లే. అయితే ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.” అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. వారు, “ఇతనికి మరణశిక్ష విధించాలి” అని సమాధానం ఇచ్చారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి, “క్రీస్తు, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు” అన్నారు. పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. “నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే” అన్నది. అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అన్నాడు. తర్వాత అతడు ద్వారం వైపు వెళ్లాడు, అక్కడ మరొక దాసియైన అమ్మాయి అతన్ని చూసి అక్కడ ఉండిన ప్రజలతో, “ఇతడు నజరేయుడైన యేసుతో ఉన్నవాడే” అని చెప్పింది. పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు. కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు. అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, “అతని గురించి నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే కోడి కూసింది. “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
మత్తయి 26:47-75 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు. వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు. అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు. తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు. పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు. ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు. అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది? మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు. పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు. అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు. కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది. “ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.
మత్తయి 26:47-75 పవిత్ర బైబిల్ (TERV)
ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు. యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” అని ఆయన్ని ముద్దుపెట్టుకున్నాడు. యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు. యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు. యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు. నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు. ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు. కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు. వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు. కాని పేతురు కొంత దూరంలోవుండి యేసును ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి యింటి ముగింట్లో కూర్చున్నాడు. మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు. చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.” అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు. కాని యేసు సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు. యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు. ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా! మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి “ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు. ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, “నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!” అని అడిగింది. కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు. ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది. పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు. కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు. అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది. అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.
మత్తయి 26:47-75 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి–బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి–దీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను. ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి –వీడు దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి. ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారు–వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతులతో కొట్టి – క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి. పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా అనెను. అందుకతడు– నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టుపెట్టుకొని–నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి–నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు– ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక–కోడి కూయకమునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.
మత్తయి 26:47-75 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)