ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.
వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు. అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.
తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు.
యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు. పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు.
ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు.
అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు. అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది? మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు.
అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు.
పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు.
అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
“ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.