మత్తయి 16:8-11
మత్తయి 16:8-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “అల్పవిశ్వాసులారా, రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహించలేక పోతున్నారా? ఐదు రొట్టెలు ఐదు వేలమందికి పంచినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? లేక ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపలు ఎత్తారు? నేను మీతో మాట్లాడుతుంది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు? మీరు పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి” అని వారితో చెప్పారు.
మత్తయి 16:8-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసుకు అది తెలిసి, “అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? “మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో, ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా? నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు.
మత్తయి 16:8-11 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు. మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు.
మత్తయి 16:8-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను.