మత్తయి 16
16
1అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను 2–సాయంకాలమున మీరు–ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, 3ఉదయమున– ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. 4వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనానుగూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.
5ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. 6అప్పుడు యేసు–చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. 7కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. 8యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? 9మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను 10ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా? 11నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. 12అప్పుడురొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
13యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా 14వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. 15అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. 16అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని#16:16 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. చెప్పెను. 17అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు#16:17 మూలభాషలో రక్తమాంసములు. నీకు బయలు పరచలేదు. 18మరియు నీవు పేతురువు#16:18 పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము.; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. 20అటుపిమ్మట తాను క్రీస్తు#16:20 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
21అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా 22పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. 23అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను. 24అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. 25తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును. 26ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు? 27మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును. 28ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
మత్తయి 16: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.