మత్తయి 16:21-28
మత్తయి 16:21-28 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పటి నుండి యేసు తాను యెరూషలేము పట్టణానికి వెళ్లి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు, “ప్రభువా, అది నీ నుండి దూరమగు గాక, అలా నీకు ఎన్నడు జరుగకూడదు!” అని ఆయనను ప్రక్కకు తీసుకువెళ్లి గద్దింపసాగాడు. అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి “సాతానా, నా వెనుకకు పో! నీవు నాకు ఆటంకంగా ఉన్నావు; నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు వున్నాయి” అన్నారు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, కానీ నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోడానికి తెగించే వారు దానిని దక్కించుకొంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకొని తమ ప్రాణాన్ని పోగొట్టుకొంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. “ఇక్కడ నిలబడివున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
మత్తయి 16:21-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు. అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు. అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకూ మరణించరు” అని చెప్పాడు.
మత్తయి 16:21-28 పవిత్ర బైబిల్ (TERV)
అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు. పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు. యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు. యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి. తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు? మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.
మత్తయి 16:21-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు? మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 16:21-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పటినుండి యేసు తాను యెరూషలేము పట్టణానికి వెళ్లి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు, “ప్రభువా, అది నీ నుండి దూరమగు గాక, అలా నీకు ఎన్నడు జరుగకూడదు!” అని ఆయనను ప్రక్కకు తీసుకెళ్లి గద్దింపసాగాడు. అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, “సాతానా, నా వెనుకకు పో! నీవు నాకు ఆటంకంగా ఉన్నావు; నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి” అన్నారు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణానికి తెగించేవారు దాన్ని దక్కించుకొంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకుని తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.