మత్తయి 12:22-37
మత్తయి 12:22-37 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డి మూగవానిగా ఉండిన ఒకనిని కొందరు యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, వాడు చూడగలుగునట్లు మాట్లాడగలుగునట్లు యేసు వానిని బాగుచేశారు. కనుక ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు. కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు, ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది. అలాగే ఏ పట్టణమైనా లేదా కుటుంబమైన తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నిలబడదు. ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే వాడు తనను తాను వ్యతిరేకించుకొని చీలిపోతాడు. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ ప్రజలు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు వారే మీకు తీర్పుతీర్చుతారు. కానీ ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థం. ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు. “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను. మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు. “చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండివుందో దానినే నోరు మాట్లాడుతుంది. మంచి వారు తనలో నిండివున్న మంచివాటినే బయటికి తెస్తారు అలాగే చెడ్డవారు తనలో నిండివున్న చెడ్డవాటినే బయటికి తెస్తారు. కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కొరకు తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే. ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.”
మత్తయి 12:22-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి. అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు. పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు. ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు. ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు. దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే. ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు. నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే. “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు. “చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలా కాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు. విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు. మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను. నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”
మత్తయి 12:22-37 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి. ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు. పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు. వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది. సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది? నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు. ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా! అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు. నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు. “అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు. మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు. “మీరు మంచిఫలాలు కావాలనుకుంటే, చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది. మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. మంచివానిలో మంచి ఉంటుంది. కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది. కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మీరాడిన మాటల్ని బట్టి మీరు నిరపరాధులో, అపరాధులో నిర్ణయింపబడుతుంది” అని అన్నాడు.
మత్తయి 12:22-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు దయ్యముపెట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరు విస్మయమొంది –ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా –మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.