మత్తయి 12:22-37

మత్తయి 12:22-37 TCV

అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డి మూగవానిగా ఉండిన ఒకనిని కొందరు యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, వాడు చూడగలుగునట్లు మాట్లాడగలుగునట్లు యేసు వానిని బాగుచేశారు. కనుక ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు. కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు, ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది. అలాగే ఏ పట్టణమైనా లేదా కుటుంబమైన తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నిలబడదు. ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే వాడు తనను తాను వ్యతిరేకించుకొని చీలిపోతాడు. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ ప్రజలు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు వారే మీకు తీర్పుతీర్చుతారు. కానీ ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థం. ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు. “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను. మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు. “చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండివుందో దానినే నోరు మాట్లాడుతుంది. మంచి వారు తనలో నిండివున్న మంచివాటినే బయటికి తెస్తారు అలాగే చెడ్డవారు తనలో నిండివున్న చెడ్డవాటినే బయటికి తెస్తారు. కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కొరకు తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే. ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.”