మత్తయి 11:2-11
మత్తయి 11:2-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి చెరసాలలో ఉన్న యోహాను విని, ఆయన దగ్గరకు తన శిష్యులను పంపించి, “రావలసిన వాడవు నీవేనా, లేక మేము వేరొకరి కొరకు చూడాలా?” అని ఆయనను అడగమన్నాడు. యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది. నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు. యోహాను శిష్యులు వెళ్లిపోతుండగా, యేసు జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించాడు, “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా? అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించిన వ్యక్తులు రాజభవనాల్లో ఉంటారు. మరి ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను. అతని గురించి ఇలా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’ స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవానిగా ఎదిగినవారు ఒక్కరు లేరు; అయినప్పటికి, పరలోకరాజ్యంలో అందరికన్నా అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
మత్తయి 11:2-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు. యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది. నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు. వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా? అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు? నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు. మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? సరే గాని, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను. ‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే. స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు.
మత్తయి 11:2-11 పవిత్ర బైబిల్ (TERV)
కారాగారంలోవున్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి, వాళ్ళ ద్వారా, “రావలసిన వాడవు నువ్వేనా? లేక మరెవరికోసమైనా మేము ఎదురు చూడాలా?” అని అడిగించాడు. యేసు, “మీరు విన్నవాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి. గ్రుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటివాళ్ళు నడువ గలుగుతున్నారని, కుష్టురోగులకు నయమైపోతోందని, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్ళకు ప్రకటింపబడుతోందని చెప్పండి. నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు. యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే, యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు? గాలికి కొట్టుకొనే రెల్లును చూడాలని వెళ్ళారా? మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు. మరి, ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? అవును, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను. అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు: ‘నీ కన్నా ముందు నా దూతను పంపుతాను, అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు.’ “ఇది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్ళలో బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు.
మత్తయి 11:2-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. యేసు వారిని చూచి– మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను. వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను –మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో–సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.– ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు.