మత్తయి 11:2-11

మత్తయి 11:2-11 TCV

క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి చెరసాలలో ఉన్న యోహాను విని, ఆయన దగ్గరకు తన శిష్యులను పంపించి, “రావలసిన వాడవు నీవేనా, లేక మేము వేరొకరి కొరకు చూడాలా?” అని ఆయనను అడగమన్నాడు. యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది. నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు. యోహాను శిష్యులు వెళ్లిపోతుండగా, యేసు జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించాడు, “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా? అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించిన వ్యక్తులు రాజభవనాల్లో ఉంటారు. మరి ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను. అతని గురించి ఇలా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’ స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవానిగా ఎదిగినవారు ఒక్కరు లేరు; అయినప్పటికి, పరలోకరాజ్యంలో అందరికన్నా అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.