లూకా 9:51-62

లూకా 9:51-62 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

తాను పరలోకానికి ఎత్తబడే సమయం ఆసన్నమైనదని గ్రహించి, యేసు యెరూషలేముకు వెళ్లాలని మనస్సును స్థిరపరచుకున్నారు. తన కొరకు బస సిద్ధం చేయడానికి తనకంటే ముందుగా, కొందరిని సమరయ్యుల గ్రామానికి పంపారు. కాని అక్కడి ప్రజలు ఆయన యెరూషలేముకు వెళ్తున్నారని తెలిసి, ఆయనను చేర్చుకోలేదు. ఆయన శిష్యులైన యాకోబు మరియు యోహాను అది చూసి, ఆయనతో, “ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేయమంటావా?” అని అడిగారు. అయితే యేసు వారివైపు తిరిగి వారిని గద్దించారు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో మరొక గ్రామానికి వెళ్లారు. వారు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు ఆయనతో, “నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అని అన్నాడు. అందుకు యేసు, “నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనితో చెప్పారు. ఆయన ఇంకొకనితో, “నన్ను వెంబడించు” అన్నారు. అందుకు అతడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతి పెట్టడానికి నన్ను వెళ్లనివ్వు!” అని అన్నాడు. యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకొంటారు, నీవైతే వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అని చెప్పారు. ఇంకొకడు ఆయనతో, “ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను; కానీ మొదట నేను వెళ్లి నా కుటుంబీకులకు వెళ్తున్నానని చెప్పి వస్తా” అన్నాడు. అందుకు యేసు వానితో, “నాగలిపై చేయి వేసాక వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు” అని అన్నారు.

షేర్ చేయి
Read లూకా 9

లూకా 9:51-62 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు తాను పరలోకానికి ఎక్కిపోవలసిన సమయం దగ్గర పడింది అని గ్రహించి ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు. ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు. శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి, “ప్రభూ, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా?” అని అడిగారు. ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు. అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు. వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి, “నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు” అని అతనికి చెప్పాడు. ఆయన మరో వ్యక్తిని చూసి “నా వెంట రా” అన్నాడు. ఆ వ్యక్తి, “ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి” అన్నాడు. అందుకాయన, “చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అని అతనితో చెప్పాడు. మరొకడు, “ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి” అన్నాడు. దానికి యేసు, “నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు” అని వాడితో చెప్పాడు.

షేర్ చేయి
Read లూకా 9

లూకా 9:51-62 పవిత్ర బైబిల్ (TERV)

ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు. ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు. ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?” అని అడిగారు. యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు. అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు. వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు. యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు. యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు. కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు. యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు. ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు. అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.

షేర్ చేయి
Read లూకా 9

లూకా 9:51-62 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి–ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి. వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడు–నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరియొకనితో–నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను అందుకాయనమృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరియొకడు –ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు–నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 9