లూకా 9:51-62

లూకా 9:51-62 TERV

ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు. ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు. ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?” అని అడిగారు. యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు. అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు. వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు. యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు. యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు. కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు. యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు. ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు. అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.