లూకా 9:1-36
లూకా 9:1-36 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు పన్నెండుమందిని దగ్గరకు పిలిచి దయ్యాలను వెళ్లగొట్టడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి శక్తి, అధికారం ఇచ్చి, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారిని పంపారు. ఆయన వారికి, “ప్రయాణం కోసం చేతికర్ర గాని, సంచి గాని, రొట్టె గాని, డబ్బు గాని, రెండవ చొక్కా గాని ఏమి తీసుకుని వెళ్లకూడదు. మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి. ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే, వారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును దులిపి వారి గ్రామం విడిచి వెళ్లిపొండి” అని చెప్పారు. కాబట్టి వారు సువార్తను ప్రకటిస్తూ ప్రతిచోట రోగులను స్వస్థపరుస్తూ గ్రామ గ్రామానికి వెళ్లారు. జరుగుతున్న సంగతులన్నిటి గురించి చతుర్థాధిపతియైన హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అని చెప్పుకుంటున్నారు, మరికొందరు ఏలీయా కనబడ్డాడని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు. అయితే హేరోదు, “నేను యోహాను తలను తీయించాను కదా, మరి నేను వింటున్నది, ఎవరి గురించి?” అని అనుకున్నాడు. అతడు ఆయనను చూడాలని ప్రయత్నించాడు. అపొస్తలులు తిరిగివచ్చి, తాము చేసినవి యేసుకు తెలియజేశారు. అప్పుడు యేసు వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అనే గ్రామానికి ఏకాంతంగా వెళ్లారు, అయితే అది తెలుసుకొని జనసమూహాలు ఆయనను వెంబడించారు. ఆయన వారిని చేర్చుకొని వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అవసరం ఉన్నవారిని స్వస్థపరిచారు. ప్రొద్దుగూకే సమయంలో ఆ పన్నెండుమంది ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం కాబట్టి జనసమూహాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు బస చేస్తారు” అన్నారు. అందుకు ఆయన, “మీరే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి!” అని జవాబిచ్చారు. అందుకు వారు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరికందరికి పెట్టాలంటే మనం వెళ్లి భోజనం కొని తీసుకురావాలి” అన్నారు. ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. అయినా ఆయన తన శిష్యులతో, “వారందరిని యాభైమంది చొప్పున గుంపులుగా కూర్చోబెట్టండి” అని చెప్పారు. వారు అలానే చేసి, వారందరిని కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. ఒక రోజు యేసు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, అప్పుడు ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని వారిని అడిగారు. అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని; కొందరు ఏలీయా అని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు” అని జవాబిచ్చారు. అయితే ఆయన, “నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు పేతురు, “దేవుని అభిషిక్తుడు అనగా క్రీస్తు” అని చెప్పాడు. ఈ విషయం ఎవరితో చెప్పకూడదని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు. ఆయన వారితో, “మనుష్యకుమారుడు అనేక శ్రమలు పొందాలి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడాలి, ఆయన చంపబడి మూడవ రోజున తిరిగి లేస్తాడు” అని చెప్పారు. ఆ తర్వాత ఆయన వారందరితో, “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా నా గురించి గాని నా మాటల గురించి గాని సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తేజస్సుతో తన తండ్రి తేజస్సుతో పరిశుద్ధ దూతల తేజస్సుతో వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు. “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. యేసు ఈ సంగతి చెప్పిన ఎనిమిది రోజుల తర్వాత, ఆయన పేతురు, యోహాను, యాకోబులను తన వెంట తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదికి వెళ్లారు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరుస్తున్నాయి. అప్పుడు మోషే, ఏలీయా అనే ఇద్దరు వ్యక్తులు యేసుతో మాట్లడుతూ అద్భుతమైన ప్రకాశంతో కనబడ్డారు. యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న, ఆయన నిష్క్రమణ గురించి వారు మాట్లాడారు. పేతురు అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు, కానీ వారు పూర్తిగా మేల్కొనినప్పుడు, ఆయన మహిమను ఇద్దరు వ్యక్తులు ఆయనతో నిలబడి ఉండడం చూశారు ఆ ఇద్దరు వ్యక్తులు యేసును విడిచి వెళ్తుండగా, పేతురు ఆయనతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది. మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని అన్నాడు. తాను ఏమి చెప్తున్నాడో తనకే తెలియదు. అతడు మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం ప్రత్యక్షమై వారిని కమ్ముకుంది, వారు దానిలోనికి వెళ్లినప్పుడు వారు భయపడ్డారు. ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన, నేను ఏర్పరచుకొన్న నా కుమారుడు, ఈయన చెప్పేది వినండి” అని చెప్పడం వినబడింది. ఆ స్వరం మాట్లాడినప్పుడు, వారు యేసు ఒంటరిగా ఉండడం చూశారు శిష్యులు తాము చూసినవాటిని గురించి ఎవరికి చెప్పకుండా తమ మనస్సులోనే ఉంచుకున్నారు.
లూకా 9:1-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపాడు. అప్పుడు ఆయన, “మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు. మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలుదేరండి. మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి” అన్నాడు. వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాల్లో పర్యటించారు. జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి కొందరు ‘యోహాను చనిపోయి లేచాడు’ అనీ, మరి కొందరు ‘ఏలీయా కనిపించాడు’ అనీ, ఇంకొంతమంది ‘పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు’ అనీ చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు హేరోదు ‘నేను యోహాను తల తీయించాను కదా. మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో’ అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు. అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు. పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు. ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు. అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు. వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు. ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. “నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “బాప్తిసమిచ్చే యోహాననీ, కొందరు ఏలీయా అనీ, కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడనీ చెప్పుకుంటున్నారు” అని ఆయనకు జవాబిచ్చారు. అప్పుడు ఆయన, “మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి” అన్నాడు. ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు. “మనుష్య కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలూ, ప్రధాన యాజకులూ, ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు. ఆయనను చంపుతారు. ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది.” అని చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు. ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం? నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. ఈ మాటలు పలికిన తరువాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి. ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే ఏలీయాలు. వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు. ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు, “ప్రభూ, మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది. నీకు ఒకటీ, మోషేకు ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేము కడతాం” అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు. అతడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు. తరువాత, “ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి” అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.
లూకా 9:1-36 పవిత్ర బైబిల్ (TERV)
యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు. వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి. ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి. ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు. సామంతరాజైన హేరోదు జరుగుతున్న వాటిని గురించి విని చాలా కంగారు పడ్డాడు. యోహాను బ్రతికి వచ్చాడని కొందరన్నారు. ఏలీయా కనిపించాడని కొందరన్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్తల్లో ఒకడు బ్రతికి వచ్చాడని అన్నారు. కాని హేరోదు, “నేను యోహాను తల నరికించాను కదా. మరి ఎవర్ని గురించి వింటున్నాను?” అని మనస్సులో అనుకొన్నాడు. హేరోదు యేసును చూడాలని ఆతృత పడ్డాడు. అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన వెంట తీసుకు వెళ్ళాడు. ప్రజలకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం చేశాడు. సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు పన్నెండు మంది అపొస్తలులు వచ్చి, “మనం ఏ మూలో ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టూ ఉన్న పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం చూసుకొంటారు” అని అన్నారు. యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరేదైనా ఆహారం ఇవ్వండి” అని అన్నాడు. వాళ్ళు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళందరికోసం ఆహారం కోనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” అని అన్నారు. సుమారు ఐదువేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభైమంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని అన్నాడు. శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. వాటిని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. అందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రెండు గంపల నిండా నింపారు. ఒకరోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు, “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్త బ్రతికి వచ్చాడు అని అంటున్నారు” అని సమాధానం చెప్పారు. “మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన అడిగాడు. పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు” అని సమాధానం చెప్పాడు. “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు. ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు. ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి? నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు.” ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం మొదలు పెట్టాయి. అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు తేజస్సుతో యేసు ముందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు మోషే, ఏలీయాలు. యెరూషలేములో నెరవేర్చబడనున్న దైవేచ్ఛను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, మాట్లాడారు. పేతురు, అతని వెంటనున్న వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో నిలుచొని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును చూసారు. మోషే, ఏలీయాలు వెళ్తుండగా పేతురు యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలీయా కొకటి మూడు పర్ణశాలలు వేయమంటారా?” అని అడిగాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు అన్నాడు. పేతురు ఈ మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను ఆ మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్నవాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి” అని వినబడింది. ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.
లూకా 9:1-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. మరియు ఆయన–మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు. మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థ పరచుచు గ్రామములలో సంచారము చేసిరి. చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు–యోహాను మృతులలోనుండి లేచెననియు, కొందరు–ఏలీయా కనబడెననియు; కొందరు–పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు–నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను. ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి–మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపెట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. ఆయన–మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు–మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చినవారు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు. ఆయన–వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరుతిని తృప్తి పొం దిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి. ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. –నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా వారు– బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు– ఏలీయాయనియు, కొందరు– పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయనమీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు–నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన –ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను –ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము? నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధదూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో–ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు– ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి.
లూకా 9:1-36 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)