లూకా సువార్త 9:1-36

లూకా సువార్త 9:1-36 TSA

యేసు పన్నెండుమందిని దగ్గరకు పిలిచి దయ్యాలను వెళ్లగొట్టడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి శక్తి, అధికారం ఇచ్చి, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారిని పంపారు. ఆయన వారికి, “ప్రయాణం కోసం చేతికర్ర గాని, సంచి గాని, రొట్టె గాని, డబ్బు గాని, రెండవ చొక్కా గాని ఏమి తీసుకుని వెళ్లకూడదు. మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి. ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే, వారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును దులిపి వారి గ్రామం విడిచి వెళ్లిపొండి” అని చెప్పారు. కాబట్టి వారు సువార్తను ప్రకటిస్తూ ప్రతిచోట రోగులను స్వస్థపరుస్తూ గ్రామ గ్రామానికి వెళ్లారు. జరుగుతున్న సంగతులన్నిటి గురించి చతుర్థాధిపతియైన హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అని చెప్పుకుంటున్నారు, మరికొందరు ఏలీయా కనబడ్డాడని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు. అయితే హేరోదు, “నేను యోహాను తలను తీయించాను కదా, మరి నేను వింటున్నది, ఎవరి గురించి?” అని అనుకున్నాడు. అతడు ఆయనను చూడాలని ప్రయత్నించాడు. అపొస్తలులు తిరిగివచ్చి, తాము చేసినవి యేసుకు తెలియజేశారు. అప్పుడు యేసు వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అనే గ్రామానికి ఏకాంతంగా వెళ్లారు, అయితే అది తెలుసుకొని జనసమూహాలు ఆయనను వెంబడించారు. ఆయన వారిని చేర్చుకొని వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అవసరం ఉన్నవారిని స్వస్థపరిచారు. ప్రొద్దుగూకే సమయంలో ఆ పన్నెండుమంది ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం కాబట్టి జనసమూహాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు బస చేస్తారు” అన్నారు. అందుకు ఆయన, “మీరే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి!” అని జవాబిచ్చారు. అందుకు వారు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరికందరికి పెట్టాలంటే మనం వెళ్లి భోజనం కొని తీసుకురావాలి” అన్నారు. ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. అయినా ఆయన తన శిష్యులతో, “వారందరిని యాభైమంది చొప్పున గుంపులుగా కూర్చోబెట్టండి” అని చెప్పారు. వారు అలానే చేసి, వారందరిని కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. ఒక రోజు యేసు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, అప్పుడు ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని వారిని అడిగారు. అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని; కొందరు ఏలీయా అని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు” అని జవాబిచ్చారు. అయితే ఆయన, “నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు పేతురు, “దేవుని అభిషిక్తుడు అనగా క్రీస్తు” అని చెప్పాడు. ఈ విషయం ఎవరితో చెప్పకూడదని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు. ఆయన వారితో, “మనుష్యకుమారుడు అనేక శ్రమలు పొందాలి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడాలి, ఆయన చంపబడి మూడవ రోజున తిరిగి లేస్తాడు” అని చెప్పారు. ఆ తర్వాత ఆయన వారందరితో, “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా నా గురించి గాని నా మాటల గురించి గాని సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తేజస్సుతో తన తండ్రి తేజస్సుతో పరిశుద్ధ దూతల తేజస్సుతో వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు. “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. యేసు ఈ సంగతి చెప్పిన ఎనిమిది రోజుల తర్వాత, ఆయన పేతురు, యోహాను, యాకోబులను తన వెంట తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదికి వెళ్లారు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరుస్తున్నాయి. అప్పుడు మోషే, ఏలీయా అనే ఇద్దరు వ్యక్తులు యేసుతో మాట్లడుతూ అద్భుతమైన ప్రకాశంతో కనబడ్డారు. యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న, ఆయన నిష్క్రమణ గురించి వారు మాట్లాడారు. పేతురు అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు, కానీ వారు పూర్తిగా మేల్కొనినప్పుడు, ఆయన మహిమను ఇద్దరు వ్యక్తులు ఆయనతో నిలబడి ఉండడం చూశారు ఆ ఇద్దరు వ్యక్తులు యేసును విడిచి వెళ్తుండగా, పేతురు ఆయనతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది. మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని అన్నాడు. తాను ఏమి చెప్తున్నాడో తనకే తెలియదు. అతడు మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం ప్రత్యక్షమై వారిని కమ్ముకుంది, వారు దానిలోనికి వెళ్లినప్పుడు వారు భయపడ్డారు. ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన, నేను ఏర్పరచుకొన్న నా కుమారుడు, ఈయన చెప్పేది వినండి” అని చెప్పడం వినబడింది. ఆ స్వరం మాట్లాడినప్పుడు, వారు యేసు ఒంటరిగా ఉండడం చూశారు శిష్యులు తాము చూసినవాటిని గురించి ఎవరికి చెప్పకుండా తమ మనస్సులోనే ఉంచుకున్నారు.