లూకా 8:40-56
లూకా 8:40-56 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు తిరిగి రాగానే, ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషంగా ఆయనను ఆహ్వానించారు. అప్పుడు యాయీరు అనే పేరుగల సమాజమందిరపు అధికారి వచ్చి, యేసు పాదాలపై పడి, తన ఇంటికి రమ్మని బ్రతిమాలుకొన్నాడు. ఎందుకంటే సుమారు పన్నెండేళ్ల వయస్సుగల అతని ఏకైక కుమార్తె జబ్బుతో చనిపోయేలా ఉంది. యేసు అతనితో వెళ్తూ ఉండగా, ప్రజలు గుంపుగా ఆయనపై పడుతున్నారు. మరియు పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసినా గానీ, ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు. ఆమె ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టింది, వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. “నన్ను ముట్టింది ఎవరు?” అని యేసు అడిగారు. మేము కాదని అందరు అంటూ ఉంటే, పేతురు, “బోధకుడా, ప్రజలు గుంపుగా నీపై పడుతున్నారు కదా” అన్నాడు. అయినా యేసు, “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్లినట్లు నాకు తెలిసింది” అని అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, ఇక దాగి ఉండలేనని తెలిసి, వణుకుతు వచ్చి ఆయన పాదాల యెదుట సాగిలపడింది. ఆమె ఎందుకు ఆయనను ముట్టుకుందో మరియు వెంటనే ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ముందు చెప్పింది. అప్పుడు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు” అని చెప్పారు. యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చాడు, యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకునికి శ్రమ కలిగించవద్దు” అని చెప్పాడు. వారి మాటలను విని, యేసు యాయీరుతో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపడుతుంది” అని చెప్పారు. ఆయన యాయీరు ఇల్లు చేరిన తర్వాత, పేతురు, యోహాను, యాకోబు మరియు ఆ బాలిక తల్లిదండ్రులును తప్ప మరి ఎవరిని లోనికి రానివ్వలేదు. ఆ సమయంలో, ప్రజలందరు ఆమె కొరకు ఏడుస్తూ రోదిస్తున్నారు. అప్పుడు యేసు, “ఏడుపు ఆపండి! ఈమె చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. ఆమె చనిపోయిందని తెలిసి, వారు ఆయనను ఎగతాళి చేశారు. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని ఆమెతో, “చిన్నదానా, లే!” అన్నారు. అప్పుడు ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది, ఆమె వెంటనే లేచి నిలబడింది. అప్పుడాయన, “ఆమెకు తినడానికి ఏమైన ఇవ్వండి” అని వారితో చెప్పారు. ఆమె తల్లిదండ్రులు అది చూసి ఆశ్చర్యపడ్డారు, అయితే ఆయన జరిగింది ఎవరికీ చెప్పకూడదు అని వారిని ఆదేశించారు.
లూకా 8:40-56 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇవతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు. అప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు. సుమారు పన్నెండేళ్ళ వయసున్న అతని ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు. అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. యేసు, “నన్ను తాకిందెవరు?” అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు, “మాకు తెలియదే” అన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ క్రిక్కిరిసి నీమీద పడుతున్నారు” అన్నాడు. అయితే యేసు, “ఎవరో నన్ను తాకారు. నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది” అన్నాడు. ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుటా వివరించి చెప్పింది. అందుకు ఆయన, “అమ్మాయీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు” అన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయీరుతో, “మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు” అని చెప్పాడు. యేసు ఆ మాట విని, “భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది” అని చెప్పాడు. అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె కోసం ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. ఆయన వారితో, “ఏడవ వద్దు, ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు” అన్నాడు. ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, “అమ్మాయీ, లే” అని చెప్పగానే ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే లేచింది. అప్పుడు ఆయన, “ఆమెకు భోజనం పెట్టండి” అని ఆదేశించాడు. ఆమె తల్లిదండ్రులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. అప్పుడు ఆయన, “జరిగింది ఎవరికీ చెప్పవద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.
లూకా 8:40-56 పవిత్ర బైబిల్ (TERV)
ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు. అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. తన పన్నెండేండ్ల కుమార్తె కూతురు చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన యింటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడుకున్నాడు. యేసు అతని ఇంటికి వెళ్తుండగా, ప్రజలు త్రోసుకొంటూ ఆయన చుట్టూ ఉన్నారు. ఆ గుంపులో పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్తున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడూ ఆమె రోగాన్ని నయం చేయలేక పోయాడు ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆయన, “నన్నెవరు తాకారు?” అని అడిగాడు. అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ! ప్రజలు త్రోసుకొంటూ మీ మీద పడ్తున్నారు కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు. యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు. అప్పుడా స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి, వణకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా! నీ విశ్వాసం నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు” అని అన్నాడు. యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటినుండి ఒకడు వచ్చి అతనితో, “మీ కూతురు చనిపోయింది. ప్రభువును కష్టపెట్టనవసరం లేదు” అని అన్నాడు. ఇది విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని అన్నాడు. యేసు యాయీరు యింటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి తండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు. వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, “మీ శోకాలు ఆపండి. ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే” అని అన్నాడు. ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు ఆయన్ని హేళన చేసారు. యేసు ఆమె చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు. ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చొంది. యేసు వాళ్ళతో, “ఆమెకు ఏదైనా తినటానికి యివ్వండి” అని అన్నాడు. ఆమె తల్లి తండ్రులు దిగ్భ్రాంతి చెందారు. కాని యేసు జరిగిన దాన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు.
లూకా 8:40-56 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీదపడి యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తనయొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి. అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్ర్తీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. –నన్నుముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును–మేమెరుగమన్నప్పుడు, పేతురు–ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా యేసు–ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను. తాను మరుగై యుండలేదని, ఆ స్ర్తీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను. అందుకాయన–కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాటవిని–భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో –ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని –చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగివచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన –ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన– జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.