లూకా 8:40-56

లూకా 8:40-56 IRVTEL

ఇవతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు. అప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు. సుమారు పన్నెండేళ్ళ వయసున్న అతని ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు. అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. యేసు, “నన్ను తాకిందెవరు?” అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు, “మాకు తెలియదే” అన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ క్రిక్కిరిసి నీమీద పడుతున్నారు” అన్నాడు. అయితే యేసు, “ఎవరో నన్ను తాకారు. నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది” అన్నాడు. ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుటా వివరించి చెప్పింది. అందుకు ఆయన, “అమ్మాయీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు” అన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయీరుతో, “మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు” అని చెప్పాడు. యేసు ఆ మాట విని, “భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది” అని చెప్పాడు. అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె కోసం ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. ఆయన వారితో, “ఏడవ వద్దు, ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు” అన్నాడు. ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, “అమ్మాయీ, లే” అని చెప్పగానే ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే లేచింది. అప్పుడు ఆయన, “ఆమెకు భోజనం పెట్టండి” అని ఆదేశించాడు. ఆమె తల్లిదండ్రులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. అప్పుడు ఆయన, “జరిగింది ఎవరికీ చెప్పవద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.