లూకా 7:37-50
లూకా 7:37-50 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ గ్రామంలోని పాపాత్మురాలైన ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట్లో యేసు భోజనం చేస్తున్నాడని తెలుసుకొని, పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తీసుకొని వచ్చింది. ఆమె ఆయన వెనుక పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ, ఆమె తన కన్నీళ్ళతో ఆయన పాదాలు తడపడం మొదలు పెట్టింది. తర్వాత తన తలవెంట్రుకలతో వాటిని తుడిచి, గౌరవంతో ఆయన పాదాలకు ముద్దు పెడుతూ పరిమళద్రవ్యాన్ని పూసింది. ఆయనను ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూసి, తనలో తాను, “ఈయన ఒక ప్రవక్త అయ్యుంటే తనను ఎవరు తాకుతున్నారో, ఆమె ఎలాంటి పాపాత్మురాలో తెలుసుకొని ఉండేవాడు” అనుకున్నాడు. యేసు దాని గురించి, “సీమోను, నీతో ఒక మాట చెప్పాలి” అన్నారు. అతడు “చెప్పండి బోధకుడా” అన్నాడు. అప్పుడు యేసు, “అప్పు ఇచ్చే వాని దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల దేనారాలు, మరొకడు యాభై దేనారాలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చడానికి వారిద్దరి దగ్గర ఏమీ లేదని అతడు వారిద్దరి అప్పును క్షమించాడు. కాబట్టి వారిద్దరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, చెప్పు?” అని అడిగారు. అందుకు సీమోను, “అతడు, ఎవని బాకీని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అని చెప్పాడు. యేసు, “నీవు సరిగా అంచనా వేసావు” అని అతనితో చెప్పారు. తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు గానీ, ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గానీ, నేను లోపలికి వచ్చినప్పటి నుండి, ఈమె నా పాదాలకు ముద్దుపెట్టడం మానలేదు. నీవు నా తలకు నూనె పూయలేదు గానీ, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. కనుక నేను నీతో చెప్పేది ఏమనగా, ఆమె విస్తారంగా ప్రేమ చూపినందుకు ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కాని ఎవరి పాపాలు కొంచెమే క్షమించబడ్డాయో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పారు. అప్పుడు యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నారు. అందుకు అక్కడ ఆయనతో భోజన పంక్తిలో కూర్చుండిన వారు తమలో తాము, “పాపాలు కూడా క్షమిస్తున్నాడు ఈయన ఎవరు?” అని అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.
లూకా 7:37-50 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, “ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో, ఎలాంటిదో తెలుసుకోగలడు. ఈమె పాపాత్మురాలు” అని తనలో తాను అనుకున్నాడు. దానికి యేసు, “సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి” అని అతనితో అన్నాడు. అతడు, “బోధకా, చెప్పు” అన్నాడు. అప్పుడు యేసు, “అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు. ఆ అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వారిద్దరినీ క్షమించేశాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?” అని అడిగాడు. అందుకు సీమోను, “అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. దానికి యేసు, “సరిగ్గా ఆలోచించావు” అని అతనితో చెప్పి, ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, “ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పాడు. తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు, “పాపాలు క్షమించడానికి ఇతనెవరు?” అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఆయన, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.
లూకా 7:37-50 పవిత్ర బైబిల్ (TERV)
ఆ పట్టణంలో పాపాలు చేస్తూ జీవిస్తున్న ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యింట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళేముందు చలువరాతి బుడ్డిలో ఖరీదైన అత్తరు తన వెంట తీసుకువెళ్ళింది. వెనుకనుండి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలుచొంది. ఆయన పాదాలను తన కన్నీటితో తడిపి, తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంది. వాటిపై అత్తరు పోసింది. ఆయన్ని ఆహ్వానించిన పరిసయ్యుడు ఇది చూసి, “ఆయన ప్రవక్త అయినట్లైతే తనను ఎవరు తాకారో, ఆమె ఎలాంటి స్త్రీయో, అంటే ఆమె పాపం చేస్తూ జీవించే స్త్రీయని తెలుసుకుంటాడు” అని తన మనస్సులో అనుకున్నాడు. యేసు అతనితో, “సీమోనూ, నీకో విషయం చెప్పాలి!” అని అన్నాడు. “చెప్పండి, బోధకుడా!” అని సీమోను అన్నాడు. యేసు, “ఇద్దరు వ్యక్తులు ఒక షావుకారికి అప్పుండినారు. వాళ్ళలో ఒకడు అయిదు వందల దేనారాలు, యింకొకడు యాభై దేనారాలు అప్పు తీసుకొని ఉన్నారు. ఇద్దరిలో ఎవ్వరి దగ్గర కూడా అప్పుతీర్చటానికి డబ్బులేదు. అందువల్ల ఆ షావుకారు వాళ్ళిద్దరి అప్పు రద్దు చేశాడు. ఆ యిద్దరిలో ఎవరు ఆ షావుకారి పట్ల ఎక్కువ ప్రేమ కనుబరుస్తారు?” అని అడిగాడు. “ఎక్కువ ధనం అప్పున్నవాడని నేననుకొంటాను” అని సీమోను సమాధానం చెప్పాడు. యేసు, “నీ తీర్పు సరియైనది” అని అన్నాడు. ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ యింటికి వచ్చాను. కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాని ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ప్రేమతో హృదయానికి హత్తుకోలేదు. కాని ఈమె యింట్లోకి వచ్చినప్పటినుండి నా కాళ్ళను భక్తితో ముద్దాడటం మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. అందువల్ల నేను చెప్పేదేమిటంటే ఆమె చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్షమించబడిన వానికి కొంత ప్రేమ మాత్రమే ఉంటుంది” అని అన్నాడు. ఆ తర్వాత యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు. అక్కడున్న మిగతా అతిథులు, “పాపాలు కూడా క్షమించటానికి యితడెవరు?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. శాంతంగా వెళ్ళు!” అని అన్నాడు.
లూకా 7:37-50 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్ర్తీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదము లను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి–ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్ర్తీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు– సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు–అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను–అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన–నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్ర్తీవైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను–ఈ స్ర్తీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి –నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. అప్పుడాయనతోకూడ భోజన పంక్తిని కూర్చుండినవారు–పాపములు క్షమించుచున్న యితడెవ డని తమలోతాము అనుకొనసాగిరి. అందుకాయన– నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్ర్తీతో చెప్పెను.