లూకా 3:10-14
లూకా 3:10-14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్న వాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం గలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు. పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, “బోధకుడా, మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకు అతడు వారితో, “మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని చెప్పాడు. తర్వాత కొందరు సైనికులు వచ్చి, “మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకతడు, “ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు మరియు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి” అని వారితో చెప్పాడు.
లూకా 3:10-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు. పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు. “మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.
లూకా 3:10-14 పవిత్ర బైబిల్ (TERV)
“మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు. యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు. పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు. “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు. కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు. అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.
లూకా 3:10-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు జనులు–ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు–రెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్యవలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి–బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు–మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను. సైనికులును –మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు–ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.