లూకా 3
3
1తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, 2అన్నయు, కయపయు ప్రధానయాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.
3-6అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను.
– ప్రభువు మార్గము సిద్ధపరచుడి
ఆయన త్రోవలు సరాళముచేయుడి
ప్రతి పల్లము పూడ్చబడును
ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును
వంకర మార్గములు తిన్ననివగును
కరకు మార్గములు నున్ననివగును
సకల శరీరులు దేవుని రక్షణ చూతురు
అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. 7అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి–సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వాడెవడు? 8మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి – అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రా హామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను. 9ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. 10అందుకు జనులు–ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా 11అతడు–రెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్యవలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను. 12సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి–బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా 13అతడు–మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను. 14సైనికులును –మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు–ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
15ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానునుగూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా 16యోహాను – నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మ లోను#3:16 లేక, పరిశుద్ధాత్మతోను. అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును; 17ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను.
18ఇదియుగాక అతడింకను, చాల సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించు చుండెను. 19అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు 20అదివరకు తాను చేసినవన్నియు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
21ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి 22పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు–నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
23యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి, 24హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, 25మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, 26నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు, 27యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీ యేలుకు, షయల్తీయేలు నేరికి, 28నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, 29ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, 30లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, 31ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీ దుకు, 32దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు, 33నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, 34యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు, 35నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, 36షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, 37లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, 38కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లూకా 3: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.