లేవీయకాండము 26:1-13
లేవీయకాండము 26:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ దేవతా రాతి స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని పవిత్రంగా చూడాలి. నేను యెహోవాను. మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి. వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి. మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను. మీరు పండుకొనేటప్పుడు ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. ఆ దేశంలో క్రూరమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశంలోకి ఖడ్గం రాదు. మీరు మీ శత్రువులను తరుముతారు. వారు మీ ఎదుట కత్తివాత కూలుతారు. మీలో ఐదుగురు వంద మందిని తరుముతారు. వంద మంది పదివేల మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట కత్తివాత కూలిపోతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని కరుణించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థిరపరుస్తాను. మీరు చాలా కాలం నిలవ ఉన్న పాత ధాన్యం తింటారు. కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉంటుంది. నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశంలోనుండి మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి అడ్డకొయ్యలు విరగగొట్టి మిమ్మల్ని తలెత్తుకుని నడిచేలా చేశాను.
లేవీయకాండము 26:1-13 పవిత్ర బైబిల్ (TERV)
“మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను. “నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యెహోవాను. “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి. వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి. ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది. మీరు మళ్ళీ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు. “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు. మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు. “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను. ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది. నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను. నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేస్తాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!
లేవీయకాండము 26:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములులేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు; మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు. మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.
లేవీయకాండము 26:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ ‘మీ కోసం విగ్రహాలను తయారుచేసుకోవద్దు లేదా ఒక బొమ్మను గాని పవిత్రమైన రాయిని గాని నిలుపకూడదు, దాని ముందు తలవంచడానికి చెక్కిన రాయిని మీ భూమిలో పెట్టకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. “ ‘మీరు నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను. “ ‘ఒకవేళ మీరు నా శాసనాలు పాటిస్తూ, నా ఆజ్ఞలకు లోబడడానికి జాగ్రత్త వహిస్తే, వాన కాలంలో వాన పంపుతాను, భూమి తన పంటను, చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి. ద్రాక్ష కోత వరకు మీ నూర్పిడి కాలం కొనసాగుతుంది, నాటడం వరకు ద్రాక్ష కోత కొనసాగుతుంది, మీరు కోరుకునే ఆహారాన్ని మీరు తిని, మీ దేశంలో క్షేమంగా జీవిస్తారు. “ ‘నేను దేశంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాను, మీరు పడుకుంటారు, ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. నేను దేశం నుండి అడవి జంతువులను తొలగిస్తాను, ఖడ్గం మీ దేశం గుండా వెళ్లదు. శత్రువులను మీరు వెంటాడుతారు. వారు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు. మీలో అయిదుగురు వందమందిని, వందమంది పదివేలమందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు. “ ‘నేను మిమ్మల్ని దయతో చూస్తాను, మిమ్మల్ని ఫలవంతం చేస్తాను, మీ సంఖ్యను పెంచుతాను, నేను మీతో నా నిబంధనను ఉంచుతాను. క్రొత్త దానికి స్థలం ఇవ్వడానికి పాత పంటను ఖాళీ చేయునట్లు మీరు ఇంకా గత సంవత్సర పంటను తింటారు. మీ మధ్యనే నా నివాసస్థలం ఉంచుతాను. మిమ్మల్ని త్రోసివేయను. నేను మీ మధ్య నడుస్తూ మీ దేవునిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. ఈజిప్టువారికి ఇక మీరు బానిసలుగా ఉండకూడదని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే; నేను మీ బానిసత్వ కాడి యొక్క పట్టీలను విరగ్గొట్టాను, మిమ్మల్ని తలలు పైకెత్తి నడిచేలా చేశాను.