లేవీయకాండము 26:1-13

లేవీయకాండము 26:1-13 TERV

“మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను. “నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యెహోవాను. “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి. వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి. ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది. మీరు మళ్ళీ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు. “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు. మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు. “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను. ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది. నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను. నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేస్తాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!