యూదా 1:1-25
యూదా 1:1-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా, దేవునిచే పిలువబడి, తండ్రియైన దేవునిలో ప్రేమ కలిగి యేసు క్రీస్తు కొరకు సంరక్షించబడుతున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది: కరుణ, శాంతి, ప్రేమ మీలో విస్తరించును గాక. ప్రియ మిత్రులారా, మనందరం పాలుపంచుకొనే రక్షణ గురించి మీకు వ్రాయాలని చాలా ఆశించాను, కాని దేవుని పరిశుద్ధ ప్రజలకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కొరకు మీరు పోరాడుతూనే ఉండాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, వేడుకోడానికి నేను వ్రాస్తున్నాను. ఎవరి తీర్పైతే చాలాకాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసుక్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు. మీకు ఇవన్ని తెలిసినప్పటికి, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఒక్కసారే ఐగుప్తు నుండి విడిపించారు, కాని తరువాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేసారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. తమకు అప్పగించిన అధికారాన్ని నిలుపుకోలేక, తమ నివాసాలను విడిచిన దేవదూతలను గుర్తు చేసుకోండి. వారిని ఆయన మహాదినాన తీర్పు తీర్చడానికి కటిక చీకటిలో, శాశ్వతమైన గొలుసులతో బంధించి ఉంచారు. అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు. అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోకవాసుల గురించి చెడ్డగా మాట్లాడతారు. మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతలలో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు. కాని వీరు తమకు అర్థంకాని వాటిని దూషిస్తారు, అంతేకాక తెలివిలేని జంతువులు చేసినట్లు, వారు వేటిని సహజసిద్ధంగా గ్రహిస్తారో, అవే వారిని నాశనం చేస్తాయి. వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడంవలన నాశనం చేయబడ్డారు. వీరు మీ ప్రేమ విందులలో, వినోదాలలో సిగ్గు విడిచి తింటూ, త్రాగుతూ మాయని మచ్చలుగా ఉన్నారు, వారు కేవలం తమను తాము పోషించుకొనే కాపరుల్లా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోయే, వాన కురవని మబ్బుల వంటివారు. ఆకురాలు కాలంలో, ఫలాలులేకుండా పెల్లగింపబడి రెండుసార్లు చనిపోయిన చెట్లవంటివారు. వారు తమ సిగ్గును నురుగులా కనబడేలా చేసే సముద్రపు భయంకరమైన అలల వంటివారు. వారు నిలకడలేని నక్షత్రాల వంటివారు. వారి కొరకు కటిక చీకటి నిరంతరం భద్రం చేయబడి ఉంది. ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనముతో ప్రభువు వస్తారు. ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపచేస్తారు.” వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కొరకు ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు. కాని, ప్రియ మిత్రులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు మీకు ముందుగానే ఏమి చెప్పారో జ్ఞాపకం చేసుకోండి. “అంత్యకాలంలో, తమ భక్తిహీనమైన కోరికలనే అనుసరించే అపహాసకులు ఉంటారు” అని వారు మీకు చెప్పారు. అలాంటివారు లోకసంబంధులు, ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు. కాని, ప్రియ మిత్రులారా, అతి పరిశుద్ధమైన మీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరచుకొంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ, మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కొరకు మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచివుండండి. సందేహించే వారిపై దయ చూపండి; అగ్నిగుండం నుండి బయటకు లాగినట్లు ఇతరులను రక్షించండి. మరికొందరిపై భయంతో కూడిన కనికరం చూపండి. అయితే శరీర అపవిత్రతతో మరకపడిన వారి దుస్తులను కూడా ద్వేషించండి. మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, యుగయుగములకు పూర్వం, ఇప్పుడు, ఎల్లప్పుడు మహిమ ఘనత ఆధిపత్యం అధికారం కలుగును గాక! ఆమేన్.
యూదా 1:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది. దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక. ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది. ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది. ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు. అదే విధంగా, కలలు కనే వీరు ఒక వైపు తమ శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని మహిమ రూపులను గురించి చెడుగా చెబుతున్నారు. అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు. కాని వీరు, తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటివల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వీరికి బాధ! వీరు కయీను మార్గంలో నడుస్తున్నారు. జీతం కోసం బిలాము దోషంలో పడిపోయారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు. వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు. సముద్రంలోని అలల నురగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం సిద్ధంగా ఉంది. ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.” వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు. కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి. మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.
యూదా 1:1-25 పవిత్ర బైబిల్ (TERV)
యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయినటువంటి యూదా, తండ్రియైన దేవుని ద్వారా పిలువబడి, ప్రేమింపబడి, యేసు క్రీస్తులో భద్రం చేయబడినవారికి వ్రాయునదేమనగా: దేవుని అనుగ్రహం, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా లభించునుగాక! ప్రియ మిత్రులారా! మనమందరము కలిసి పంచుకొంటున్న రక్షణను గురించి మీకు వ్రాయాలనిపించింది. కాని మరొక విషయాన్ని గురించి వ్రాయటం చాలా ముఖ్యమనిపిస్తోంది. అదేమిటంటే దేవుడు తన పవిత్రులకు అప్పగించిన సువార్తలో ఏ మార్పు రాకుండా మీరు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు దుర్బోధకులు మీలో రహస్యంగా చేరి ఉన్నారు. వీళ్ళు శిక్షింపదగినవాళ్ళని చాలా కాలం క్రిందటే లేఖనాల్లో వ్రాయబడింది. వీళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించువారు. వీళ్ళు దైవానుగ్రహాన్ని ఉపయోగించుకొంటూ అవినీతిగా జీవిస్తారు. వీళ్ళు మన ఏకైక ప్రభువు, పాలకుడు అయిన యేసు క్రీస్తును నిరాకరిస్తూ ఉంటారు. మీకీ విషయాలన్నీ తెలుసు. అయినా కొన్ని విషయాలు జ్ఞాపకం చెయ్యాలని అనుకొంటున్నాను. ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన ప్రజలకు, ప్రభువు స్వేచ్ఛ కలిగించాడు. కాని ఆ తర్వాత వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేసాడు. తమ తమ స్థానాలను, అధికారాలను వదిలిన దేవదూతలను దేవుడు చిరకాలపు సంకెళ్ళతో అంధకారంలో బంధించి ఉంచాడు. చివరి రోజుదాకా అదేవిధంగా బంధించి ఉంచుతాడు. సొదొమ, గొమొఱ్ఱా పట్టణాల ప్రజలు, వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక సహవాసాలకు లోనైపొయ్యారు. అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షననుభవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు నిదర్శనంగా నిలిచిపోయింది. వాళ్ళలాగే కలలుగనే ఈ దుర్బోధకులు తమ శరీరాల్ని మలినం చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని దూషిస్తూ ఉంటారు. కాని ప్రధాన దేవదూత అయిన మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో వాదించినప్పుడు సాతాన్ని నిందించలేదు. వాణ్ణి దూషించ లేదు. అతడంత ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. సాతానుతో, “ప్రభువు నిన్ను గద్దిస్తాడు” అని మాత్రం అన్నాడు. ఈ దుర్బోధకులు తమకర్థం కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడుతారు. తెలివిలేక లౌకికంగా అర్థం చేసికొంటారు. పశువుల్లా వీటి ద్వారా నశించిపోతారు. వీళ్ళు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం కోసం బిలాము చేసిన తప్పునే చేసారు. కోరహు వలె తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపొయ్యారు. వీళ్ళకు శ్రమ కలుగుగాక! వీళ్ళు మీరు చేసే సమాజ విందుల్లో ఏ మాత్రం సిగ్గు లేకుండా పాల్గొంటారు. తమ కడుపులు బాగా నింపుకొంటారు. గాలికి ఎగిరే నీళ్ళులేని మేఘాల్లాంటి, ఫలమివ్వని ఎండిన వృక్షంలాంటివాళ్ళు. వ్రేళ్ళు పెకిలింపబడి రెండు సార్లు చనిపోయిన వృక్షంలాంటివాళ్ళు. అవమానమనే నురుగు కక్కే సముద్రపు కెరటాల్లాంటివాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్షత్రాల్లాంటివాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని శాశ్వతంగా దాచి ఉంచాడు. ఆదాము తర్వాత ఏడవ వాడైన హనోకు వీళ్ళను గురించి ఈ విధంగా ప్రవచించాడు: “అదిగో! ప్రభువు వేలకొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు. వచ్చి అందరిపై తీర్పు చెపుతాడు. దుర్మార్గపు పనులు చేసే అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే పాపుల్ని శిక్షిస్తాడు.” ఈ దుర్బోధకులు సణుగుతూ తప్పులెంచుతూ ఉంటారు. తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ, ప్రగల్భాలు చెప్పుకొంటూ తమ లాభం కోసం ఇతర్లను పొగుడుతూ ఉంటారు. కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు. కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి. సంశయాలున్నవాళ్ళ పట్ల కనికరం చూపండి. మంటల్లో పడబోయేవాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్నవాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా, వాళ్ళ పట్ల కనికరం చూపండి. క్రిందపడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగలడు. మీలో ఏ లోపం లేకుండా చేసి తేజోవంతమైన తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించగలడు. అలాంటి ఆయనకు, మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.
యూదా 1:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపెట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారముచేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాక రించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక– ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనముచేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింప బడిన చెట్లుగాను, తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గముతప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది. ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను –ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి. సందేహపడువారిమీద కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా, మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమేన్.
యూదా 1:1-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా, దేవునిచే పిలువబడి, తండ్రియైన దేవునిలో ప్రేమ కలిగి యేసు క్రీస్తు కోసం సంరక్షించబడుతున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది: కరుణ, శాంతి, ప్రేమ మీలో సమృద్ధిగా కలుగును గాక. ప్రియ మిత్రులారా, మనందరం పాలుపంచుకొనే రక్షణ గురించి మీకు వ్రాయాలని చాలా ఆశించాను, కాని దేవుని పరిశుద్ధ ప్రజలకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కోసం మీరు పోరాడుతూనే ఉండాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, వేడుకోడానికి నేను వ్రాస్తున్నాను. ఎవరి గురించి తీర్పు చాలా కాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసు క్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు. మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఒక్కసారే ఈజిప్టు దేశం నుండి విడిపించారు, కాని తర్వాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేశారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. తమకు అప్పగించిన అధికారాన్ని నిలుపుకోలేక, తమ నివాసాలను విడిచిన దేవదూతలను గుర్తుచేసుకోండి. వారిని ఆయన మహాదినాన తీర్పు తీర్చడానికి కటిక చీకటిలో, శాశ్వతమైన గొలుసులతో బంధించి ఉంచారు. అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు. అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోక సంబంధులను దూషిస్తారు. మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతల్లో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం, “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు. అయినా ఈ ప్రజలు తాము గ్రహించలేని వాటిని దూషిస్తారు, అంతేకాక తెలివిలేని జంతువులు చేసినట్లు, వారు వేటిని సహజసిద్ధంగా గ్రహిస్తారో, అవే వారిని నాశనం చేస్తాయి. వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడం వలన నాశనం చేయబడ్డారు. వీరు మీ ప్రేమ విందుల్లో, వినోదాలలో సిగ్గువిడిచి తింటూ, త్రాగుతూ మాయని మచ్చలుగా ఉన్నారు, వారు కేవలం తమను తాము పోషించుకునే కాపరుల్లా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోయే, వాన కురవని మబ్బుల వంటివారు. ఆకురాలు కాలంలో, ఫలాలులేకుండా పెల్లగింపబడి రెండు సార్లు చనిపోయిన చెట్లవంటివారు. వారు తమ సిగ్గును నురుగులా కనబడేలా చేసే సముద్రపు భయంకరమైన అలల వంటివారు. వారు నిలకడలేని నక్షత్రాల వంటివారు. వారి కోసం కటిక చీకటి నిరంతరం భద్రం చేయబడి ఉంది. ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనంతో ప్రభువు వస్తారు. అందరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపజేస్తారు.” వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కోసం ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు. కాని, ప్రియ మిత్రులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు మీకు ముందుగానే ఏమి చెప్పారో జ్ఞాపకం చేసుకోండి. “అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు ఉంటారు” అని వారు మీకు చెప్పారు. అలాంటివారు సహజ సంబంధులు, వీరు ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు. కాని, ప్రియ మిత్రులారా, అతిపరిశుద్ధమైన మీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరచుకొంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ, మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. సందేహించే వారిపై దయ చూపండి; అగ్నిగుండం నుండి బయటకు లాగినట్లు ఇతరులను రక్షించండి. మరికొందరిపై భయంతో కూడిన కనికరం చూపండి. అయితే శరీర అపవిత్రతతో మరకపడిన వారి దుస్తులను కూడా ద్వేషించండి. మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, యుగయుగములకు పూర్వం, ఇప్పుడు, ఎల్లప్పుడు మహిమ ఘనత ఆధిపత్యం అధికారం కలుగును గాక! ఆమేన్.