యూదా 1

1
1యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా,
దేవునిచే పిలువబడి, తండ్రియైన దేవునిలో ప్రేమ కలిగి యేసు క్రీస్తు కొరకు సంరక్షించబడుతున్న#1:1 కొన్ని ప్రతులలో యేసుక్రీస్తుచే వారికి శుభమని చెప్పి వ్రాయునది:
2కరుణ, శాంతి, ప్రేమ మీలో విస్తరించును గాక.
భక్తిహీనుల పాపం మరియు వారి విధి
3ప్రియ మిత్రులారా, మనందరం పాలుపంచుకొనే రక్షణ గురించి మీకు వ్రాయాలని చాలా ఆశించాను, కాని దేవుని పరిశుద్ధ ప్రజలకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కొరకు మీరు పోరాడుతూనే ఉండాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, వేడుకోడానికి నేను వ్రాస్తున్నాను. 4ఎవరి తీర్పైతే చాలాకాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసుక్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.
5మీకు ఇవన్ని తెలిసినప్పటికి, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు#1:5 కొన్ని ప్రాచీన ప్రతులలో యేసు ఒక్కసారే ఐగుప్తు నుండి విడిపించారు, కాని తరువాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేసారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. 6తమకు అప్పగించిన అధికారాన్ని నిలుపుకోలేక, తమ నివాసాలను విడిచిన దేవదూతలను గుర్తు చేసుకోండి. వారిని ఆయన మహాదినాన తీర్పు తీర్చడానికి కటిక చీకటిలో, శాశ్వతమైన గొలుసులతో బంధించి ఉంచారు. 7అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.
8అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోకవాసుల గురించి చెడ్డగా మాట్లాడతారు. 9మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతలలో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు. 10కాని వీరు తమకు అర్థంకాని వాటిని దూషిస్తారు, అంతేకాక తెలివిలేని జంతువులు చేసినట్లు, వారు వేటిని సహజసిద్ధంగా గ్రహిస్తారో, అవే వారిని నాశనం చేస్తాయి.
11వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడంవలన నాశనం చేయబడ్డారు.
12వీరు మీ ప్రేమ విందులలో, వినోదాలలో సిగ్గు విడిచి తింటూ, త్రాగుతూ మాయని మచ్చలుగా ఉన్నారు, వారు కేవలం తమను తాము పోషించుకొనే కాపరుల్లా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోయే, వాన కురవని మబ్బుల వంటివారు. ఆకురాలు కాలంలో, ఫలాలులేకుండా పెల్లగింపబడి రెండుసార్లు చనిపోయిన చెట్లవంటివారు. 13వారు తమ సిగ్గును నురుగులా కనబడేలా చేసే సముద్రపు భయంకరమైన అలల వంటివారు. వారు నిలకడలేని నక్షత్రాల వంటివారు. వారి కొరకు కటిక చీకటి నిరంతరం భద్రం చేయబడి ఉంది.
14ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనముతో ప్రభువు వస్తారు. 15ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపచేస్తారు.” 16వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కొరకు ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు.
పట్టుదలగా ఉండడానికి పిలుపు
17కాని, ప్రియ మిత్రులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు మీకు ముందుగానే ఏమి చెప్పారో జ్ఞాపకం చేసుకోండి. 18“అంత్యకాలంలో, తమ భక్తిహీనమైన కోరికలనే అనుసరించే అపహాసకులు ఉంటారు” అని వారు మీకు చెప్పారు. 19అలాంటివారు లోకసంబంధులు, ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు.
20కాని, ప్రియ మిత్రులారా, అతి పరిశుద్ధమైన మీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరచుకొంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ, 21మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కొరకు మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచివుండండి.
22సందేహించే వారిపై దయ చూపండి; 23అగ్నిగుండం నుండి బయటకు లాగినట్లు ఇతరులను రక్షించండి. మరికొందరిపై భయంతో కూడిన కనికరం చూపండి. అయితే శరీర అపవిత్రతతో మరకపడిన వారి దుస్తులను కూడా ద్వేషించండి.
దీవెన
24మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, 25మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, యుగయుగములకు పూర్వం, ఇప్పుడు, ఎల్లప్పుడు మహిమ ఘనత ఆధిపత్యం అధికారం కలుగును గాక! ఆమేన్.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యూదా 1: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యూదా 1 కోసం వీడియో