యెహోషువ 14:6-14
యెహోషువ 14:6-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువయొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెను–కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్నుగూర్చియు నిన్నుగూర్చియు చెప్పినమాట నీ వెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి–నీవు నా దేవుడైన యెహోవాను నిండుమనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధముచేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకుగాని నాకెప్పటియట్లు బల మున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీయులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండినయెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది.
యెహోషువ 14:6-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు కెనెజీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబు అతనితో ఇలా మనవి చేశాడు. “కాదేషు బర్నేయలో దైవజనుడు మోషేతో యెహోవా నన్ను గూర్చీ నిన్ను గూర్చీ చెప్పిన మాట నీకు తెలుసు. దేశాన్ని వేగుచూడడానికి యెహోవా సేవకుడు మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాల వయసు. ఎవరికీ భయపడకుండా నేను చూసింది చూసినట్టే అతనికి సమాచారం తెచ్చాను. నాతో వచ్చిన నా సోదరులు ప్రజల హృదయాలు హడలిపోయేలా చేసినా నేను మాత్రం నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. ఆ రోజు మోషే నాతో ప్రమాణపూర్వకంగా ‘నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకూ నీ సంతానానికీ ఎప్పటికీ స్వాస్థ్యంగా ఉంటుంది’ అన్నాడు. యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు సంవత్సరాలు ఆయన చెప్పినట్టే నన్ను సజీవంగా కాపాడాడు. ఇదిగో, నాకిప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు. మోషే నన్ను యుద్ధం చేయడానికీ పంపినప్పుడు నాకెంత బలముందో ఈ రోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికీ రావడానికీ పోవడానికీ నాకు ఎప్పటిలాగా బలముంది. కాబట్టి ఆ రోజు యెహోవా వాగ్దానం చేసిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు. ప్రాకారాలు గల గొప్ప పట్టణాల్లో అక్కడ అనాకీయులు ఉన్న సంగతి నీవు విన్నావు. యెహోవా నాకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటాను.” యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబును దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాడు కాబట్టి హెబ్రోను కాలేబుకు నేటివరకూ స్వాస్థ్యంగా ఉంది.
యెహోషువ 14:6-14 పవిత్ర బైబిల్ (TERV)
ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీవాడైన యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు మోషేతో మాట్లాడుతూ నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు. మనం వెళ్లబోతున్న దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను. అయితే నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయాలను వారితో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని యెహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా నమ్మాను. కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేసాడు: ‘నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించావు గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.’ “ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను. కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇవ్వు. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.” యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు. ఇప్పటికీ ఆ హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి అతడు నమ్ముకొని విధేయుడైనందువల్ల ఇప్పటికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది.
యెహోషువ 14:6-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు. యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియా నుండి దేశాన్ని పరిశోధించడానికి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు. నా నమ్మకం ప్రకారం నేను అతనికి ఒక నివేదికను తీసుకువచ్చాను, కానీ నాతో వచ్చిన నా తోటి ఇశ్రాయేలీయులు ప్రజల గుండెలు భయంతో కరిగిపోయేలా చేశారు. అయితే, నేను నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించాను. కాబట్టి ఆ రోజున మోషే నాతో ప్రమాణం చేసి, ‘నీవు నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన దేశం నీకు, నీ పిల్లలకు శాశ్వత వారసత్వంగా ఉంటుంది’ అని చెప్పాడు. “యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు! మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను. ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు. అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హృదయమంతటితో అనుసరించాడు కాబట్టి అప్పటినుండి హెబ్రోను కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబుకు వారసత్వంగా ఉంది.