ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీవాడైన యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు మోషేతో మాట్లాడుతూ నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు. మనం వెళ్లబోతున్న దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను. అయితే నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయాలను వారితో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని యెహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా నమ్మాను. కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేసాడు: ‘నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించావు గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.’ “ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను. కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇవ్వు. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.” యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు. ఇప్పటికీ ఆ హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి అతడు నమ్ముకొని విధేయుడైనందువల్ల ఇప్పటికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది.
Read యెహోషువ 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెహోషువ 14:6-14
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు