యోబు 28:12-28
యోబు 28:12-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది? ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు; అది సజీవుల దేశంలో దొరకదు. “అది నాలో లేదు” అని అగాధం అంటుంది; “అది నాలో లేదు” అని సముద్రం అంటుంది. మేలిమి బంగారంతో దానిని కొనలేము, దాని వెలకు సరిపడా వెండిని తూచలేము. ఓఫీరు బంగారంతోనైనా విలువైన గోమేధికంతోనైనా నీలమణితోనైనా దానిని కొనలేము. బంగారాన్ని కాని స్ఫటికాన్ని కాని దానితో పోల్చలేము; బంగారు ఆభరణాలతో కూడా దాన్ని పొందలేము. పగడము చంద్రకాంత శిల ప్రస్తావించదగినవి కావు; జ్ఞానం యొక్క ధర మాణిక్యాలకు మించినది. కూషుదేశపు విలువైన రాయిని దానితో పోల్చలేము; శుద్ధమైన బంగారంతో కూడా దానిని కొనలేము. అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది? అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది, ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది. “కేవలం దాని గురించిన వదంతిని విన్నాము” నరకము మృత్యువు అంటాయి. దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు. ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు జలములను కొలిచినప్పుడు, వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు, అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు; ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు. అంతేకాక మనుష్యజాతితో, “యెహోవాకు భయపడడమే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు.
యోబు 28:12-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది. బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు. అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు. సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము. పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది. కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము. అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం. “మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము” అని నాశనం, మరణం అంటాయి. దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు. ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు. గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు, వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు, ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు. యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.
యోబు 28:12-28 పవిత్ర బైబిల్ (TERV)
“అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి? జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు. భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు. ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది. అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము. జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు. ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని, నీలంతో గాని, అది కొనబడేది కాదు. బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది. బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు. జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది. జ్ఞానం కెంపులకంటె ఖరీదైనది. ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు. మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు. “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి? అవగాహన చేసికోవటం నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి? భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు. ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ అని మరణం, నాశనం చెబుతాయి. “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు. భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు. ఆకాశాల క్రింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు. గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు, వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు దానిని పరీక్షించిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు. ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’” అని దేవుడు ప్రజలతో చెప్పాడు.
యోబు 28:12-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది? నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము–అది నాలో లేదనును సముద్రము–నాయొద్ద లేదనును. సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది. మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును. ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతోకూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను. మరియు–యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.