యోబు 28
28
విరామం: జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది
1వెండికి గని ఉన్నది
బంగారాన్ని పుటం వేయడానికి ఒక స్థలం ఉన్నది.
2ఇనుము మట్టిలో నుండి తీయబడుతుంది,
ధాతువు కరిగించి రాగి తీస్తారు.
3చీకటిలో కాంతిని ఎలా ప్రకాశింప చేయాలో మానవులకు తెలుసు;
ధాతువు కోసం చీకటిలో శోధిస్తున్నప్పుడు
భూమి యొక్క సుదూర ప్రాంతాలను అన్వేషిస్తారు.
4మనుష్యుల నివాస స్థలాలకు దూరంగా,
మానవ అడుగులు పడని చోట్లలో;
వ్రేలాడుతూ ఊగుతూ సొరంగాలు త్రవ్వుతారు.
5భూమిపై ఆహారం పెంచబడుతుంది,
కాని దాని లోపలి భాగం అగ్నికి కరిగిపోయి ఉంటుంది.
6దాని రాళ్లల్లో నీలమణులుంటాయి.
దాని మట్టిలో బంగారం ఉంటుంది.
7దాని త్రోవ ఏ గ్రద్దకు తెలియదు,
డేగ కన్ను కూడా దానిని చూడలేదు.
8గర్వంగల క్రూరమృగాలు ఆ దారిలో అడుగుపెట్టలేదు,
ఏ సింహం అక్కడ నడవలేదు.
9మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు.
కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు.
10బండలో వారు సొరంగం త్రవ్వుతారు.
దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది.
11వారు నదుల మూలాలను శోధిస్తారు,
మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు.
12అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
అవగాహన ఎక్కడ నివసిస్తుంది?
13ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు;
అది సజీవుల దేశంలో దొరకదు.
14“అది నాలో లేదు” అని అగాధం అంటుంది;
“అది నాలో లేదు” అని సముద్రం అంటుంది.
15మేలిమి బంగారంతో దానిని కొనలేము,
దాని వెలకు సరిపడా వెండిని తూచలేము.
16ఓఫీరు బంగారంతోనైనా విలువైన గోమేధికంతోనైనా
నీలమణితోనైనా దానిని కొనలేము.
17బంగారాన్ని కాని స్ఫటికాన్ని కాని దానితో పోల్చలేము;
బంగారు ఆభరణాలతో కూడా దాన్ని పొందలేము.
18పగడము చంద్రకాంత శిల ప్రస్తావించదగినవి కావు;
జ్ఞానం యొక్క ధర మాణిక్యాలకు మించినది.#28:18 ఈ ప్రశస్తమైన రాళ్ల పేర్లను క్లుప్తీకరించడం కష్టం
19కూషుదేశపు విలువైన రాయిని దానితో పోల్చలేము;
శుద్ధమైన బంగారంతో కూడా దానిని కొనలేము.
20అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది?
అవగాహన ఎక్కడ నివసిస్తుంది?
21అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది,
ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది.
22“కేవలం దాని గురించిన వదంతిని విన్నాము”
నరకము#28:22 హెబ్రీలో అబద్దోను మృత్యువు అంటాయి.
23దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు
అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు.
24ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు
ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు.
25ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు
జలములను కొలిచినప్పుడు,
26వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు
ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు,
27అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు;
ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు.
28అంతేకాక మనుష్యజాతితో,
“యెహోవాకు భయపడడమే జ్ఞానం
దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 28: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.