యోహాను 6:25-40
యోహాను 6:25-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని–బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. వారు–అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు–పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావునవారు–ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
యోహాను 6:25-40 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు. అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలను తిని తృప్తి పొందారు కనుక నన్ను వెదుకుతున్నారు తప్ప, నేను చేసిన అద్బుత క్రియలను చూసినందుకు కాదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు. అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు. అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు. కనుక వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్బుత క్రియను చేస్తావు? ఏమి చేస్తావు? మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘వారికి తినుటకు పరలోకం నుండి ఆహారాన్ని ఆయన ఇచ్చారని’ వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు. యేసు వారితో, “మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నిజమైన ఆహారం మీకిచ్చేది నా తండ్రి. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుని యొక్క ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు. అందుకు వారు “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు. అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు. అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు. తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను. ఎందుకనగా నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను. ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపాలని నన్ను పంపినవాని చిత్తమై ఉంది. కుమారుని వైపు చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందుకోవాలని, వారిని చివరి రోజున జీవంతో నేను లేపాలని నా తండ్రి చిత్తమై ఉంది.”
యోహాను 6:25-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు. యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు. పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు. అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు. దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు. వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? ‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు. అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు. అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.” అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు. దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు. కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు. తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను. ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను. ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం. ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”
యోహాను 6:25-40 పవిత్ర బైబిల్ (TERV)
యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు. యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు. చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు. వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు. యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు. కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు? మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.” యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి. ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు. వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు. యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు. కాని నేను ఇంతకు క్రితం చెప్పినట్లు, నన్ను చూసారు! అయినా మీరు నమ్మలేదు! తండ్రి నాకప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణెవణ్ణి నేను ఎన్నటికి నెట్టి వేయను. ఎందుకంటే, నేను పరలోకం నుండి నా యిష్టం నెరవెర్చుకోవటానికి దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాను. నన్ను పంపిన వాని కోరిక యిది: నా కప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టు కోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి. కుమారుని వైపు చూసి ఆయన్ని నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇది నా తండ్రి కోరిక. అలా నమ్మిన వాణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.”