వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు. అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలను తిని తృప్తి పొందారు కనుక నన్ను వెదుకుతున్నారు తప్ప, నేను చేసిన అద్బుత క్రియలను చూసినందుకు కాదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు. అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు. అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు. కనుక వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్బుత క్రియను చేస్తావు? ఏమి చేస్తావు? మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘వారికి తినుటకు పరలోకం నుండి ఆహారాన్ని ఆయన ఇచ్చారని’ వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు. యేసు వారితో, “మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నిజమైన ఆహారం మీకిచ్చేది నా తండ్రి. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుని యొక్క ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు. అందుకు వారు “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు. అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు. అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు. తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను. ఎందుకనగా నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను. ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపాలని నన్ను పంపినవాని చిత్తమై ఉంది. కుమారుని వైపు చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందుకోవాలని, వారిని చివరి రోజున జీవంతో నేను లేపాలని నా తండ్రి చిత్తమై ఉంది.”
Read యోహాను 6
వినండి యోహాను 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 6:25-40
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు