యోహాను 20:1-28
యోహాను 20:1-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారం మొదటి రోజున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వెళ్లి సమాధి ద్వారాన్ని మూసిన రాయి తొలగిపోయి ఉండడం చూసింది. కాబట్టి ఆమె సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “వారు ప్రభువును సమాధిలో నుండి తీసుకుని వెళ్లిపోయారు. ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అని చెప్పింది. కాబట్టి పేతురు, మరొక శిష్యుడు వెంటనే సమాధి దగ్గరకు బయలుదేరారు. వారిద్దరు పరుగెడుతూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదట సమాధి దగ్గరకు చేరుకున్నాడు. అతడు సమాధిలోనికి వంగి నారబట్టలు పడి ఉన్నాయని చూశాడు కాని దాని లోపలికి వెళ్లలేదు. ఆ తర్వాత అతని వెనకాలే వచ్చిన సీమోను పేతురు నేరుగా సమాధిలోనికి వెళ్లి, అక్కడ నారబట్టలు పడి ఉన్నాయని, యేసు తలకు చుట్టిన రుమాలు, ఆ నారబట్టలతో కాకుండా వేరే చోట మడతపెట్టి ఉందని చూశాడు. సమాధి దగ్గరకు మొదట చేరుకున్న శిష్యుడు కూడ లోపలికి వెళ్లి చూసి నమ్మాడు. యేసు చనిపోయి తిరిగి జీవంతో లేస్తాడని చెప్పే లేఖనాలను వారు ఇంకా గ్రహించలేదు. తర్వాత ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్లిపోయారు. కాని మరియ, సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ సమాధిలోనికి తొంగి చూసినప్పుడు, తెల్లని బట్టలను ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహాన్ని ఉంచిన చోట తల వైపున ఒకరు కాళ్ల వైపున మరొకరు కూర్చుని ఉండడం చూసింది. వారు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. అందుకు ఆమె, “వారు నా ప్రభువును సమాధిలో నుండి తీసుకుని వెళ్లిపోయారు. వారు ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అన్నది. అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది, కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తు పట్టలేదు. ఆయన, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెదకుతున్నావు?” అని అడిగారు. ఆమె ఆయనను తోటమాలి అనుకుని, “అయ్యా, నీవు ఆయనను తీసుకెళ్తే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు. నేను ఆయనను తీసుకెళ్తాను” అన్నది. యేసు ఆమెను, “మరియ” అని పిలిచారు. ఆమె ఆయన వైపుకు తిరిగి “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో “బోధకుడు” అని అర్థము. యేసు, “నేను తండ్రి దగ్గరకు ఇంకా ఆరోహణమవ్వలేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. నీవు నా సహోదరుల దగ్గరకు వెళ్లి వారితో, ‘నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడునైన వాని దగ్గరకు ఎక్కి వెళ్తున్నాను’ అని వారితో చెప్పు” అన్నారు. మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్లి, “నేను ప్రభువును చూశాను! ఆయన నాతో ఈ సంగతులు చెప్పారు” అని వారికి చెప్పింది. ఆదివారం సాయంకాలాన యూదా నాయకులకు భయపడి తలుపులను మూసుకుని శిష్యులందరు ఒక్కచోట ఉన్నప్పుడు, యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి వారితో, “మీకు సమాధానం కలుగును గాక!” అని చెప్పారు. ఆయన ఆ విధంగా చెప్పి వారికి తన చేతులను, తన ప్రక్కను చూపించగా శిష్యులు ప్రభువును చూసి చాలా సంతోషించారు. యేసు మళ్ళీ వారితో, “మీకు సమాధానం కలుగును గాక! నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని చెప్పారు. ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి; మీరు ఎవరిని క్షమించరో వారు క్షమించబడరు” అన్నారు. పన్నెండుమంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు. కాబట్టి మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూశాం” అని చెప్పారు. అప్పుడు అతడు వారితో, “నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను” అన్నాడు. ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో చెప్పారు. తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు. తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.
యోహాను 20:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది. కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది. కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు. వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు. అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు. ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు. అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు. ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు. అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు. అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది. ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు. యేసు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. “అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను” అంది. అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం. యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు. మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది. ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు. అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు. పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు. ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు. తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు. దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు.
యోహాను 20:1-28 పవిత్ర బైబిల్ (TERV)
ఆ రోజు ఆదివారం. “మగ్దలేనే” కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది. అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు” అని అన్నది. పేతురు, ఆ యింకొక శిష్యుడు సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ఆ యింకొక శిష్యుడు పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు. అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు. అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు. వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది. సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు. (యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.) ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు. కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది. తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు. వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు. ఆమె, “వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది. అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే “యేసు” అని ఆమె గుర్తించలేదు. ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు. అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అన్నది. యేసు ఆమెను “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో “రబ్బూనీ!” అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం. యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువంటివాని దగ్గరకు వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు. మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది. ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది. యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు. యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు. ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు. తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.
యోహాను 20:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ద లేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చి –ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి, నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు– అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె–నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు–అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని–అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి–మరియా అనిపిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అనిపిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి–నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు–మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది–పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు–మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు–నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో–నా ప్రభువా, నా దేవా అనెను.
యోహాను 20:1-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)