వారం మొదటి రోజున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వెళ్లి సమాధి ద్వారాన్ని మూసిన రాయి తొలగిపోయి ఉండడం చూసింది. కాబట్టి ఆమె సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “వారు ప్రభువును సమాధిలో నుండి తీసుకుని వెళ్లిపోయారు. ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అని చెప్పింది.
కాబట్టి పేతురు, మరొక శిష్యుడు వెంటనే సమాధి దగ్గరకు బయలుదేరారు. వారిద్దరు పరుగెడుతూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదట సమాధి దగ్గరకు చేరుకున్నాడు. అతడు సమాధిలోనికి వంగి నారబట్టలు పడి ఉన్నాయని చూశాడు కాని దాని లోపలికి వెళ్లలేదు. ఆ తర్వాత అతని వెనకాలే వచ్చిన సీమోను పేతురు నేరుగా సమాధిలోనికి వెళ్లి, అక్కడ నారబట్టలు పడి ఉన్నాయని, యేసు తలకు చుట్టిన రుమాలు, ఆ నారబట్టలతో కాకుండా వేరే చోట మడతపెట్టి ఉందని చూశాడు. సమాధి దగ్గరకు మొదట చేరుకున్న శిష్యుడు కూడ లోపలికి వెళ్లి చూసి నమ్మాడు. యేసు చనిపోయి తిరిగి జీవంతో లేస్తాడని చెప్పే లేఖనాలను వారు ఇంకా గ్రహించలేదు. తర్వాత ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్లిపోయారు.
కాని మరియ, సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ సమాధిలోనికి తొంగి చూసినప్పుడు, తెల్లని బట్టలను ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహాన్ని ఉంచిన చోట తల వైపున ఒకరు కాళ్ల వైపున మరొకరు కూర్చుని ఉండడం చూసింది.
వారు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు.
అందుకు ఆమె, “వారు నా ప్రభువును సమాధిలో నుండి తీసుకుని వెళ్లిపోయారు. వారు ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అన్నది. అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది, కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తు పట్టలేదు.
ఆయన, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెదకుతున్నావు?” అని అడిగారు.
ఆమె ఆయనను తోటమాలి అనుకుని, “అయ్యా, నీవు ఆయనను తీసుకెళ్తే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు. నేను ఆయనను తీసుకెళ్తాను” అన్నది.
యేసు ఆమెను, “మరియ” అని పిలిచారు.
ఆమె ఆయన వైపుకు తిరిగి “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో “బోధకుడు” అని అర్థము.
యేసు, “నేను తండ్రి దగ్గరకు ఇంకా ఆరోహణమవ్వలేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. నీవు నా సహోదరుల దగ్గరకు వెళ్లి వారితో, ‘నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడునైన వాని దగ్గరకు ఎక్కి వెళ్తున్నాను’ అని వారితో చెప్పు” అన్నారు.
మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్లి, “నేను ప్రభువును చూశాను! ఆయన నాతో ఈ సంగతులు చెప్పారు” అని వారికి చెప్పింది.
ఆదివారం సాయంకాలాన యూదా నాయకులకు భయపడి తలుపులను మూసుకుని శిష్యులందరు ఒక్కచోట ఉన్నప్పుడు, యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి వారితో, “మీకు సమాధానం కలుగును గాక!” అని చెప్పారు. ఆయన ఆ విధంగా చెప్పి వారికి తన చేతులను, తన ప్రక్కను చూపించగా శిష్యులు ప్రభువును చూసి చాలా సంతోషించారు.
యేసు మళ్ళీ వారితో, “మీకు సమాధానం కలుగును గాక! నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని చెప్పారు. ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి; మీరు ఎవరిని క్షమించరో వారు క్షమించబడరు” అన్నారు.
పన్నెండుమంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు. కాబట్టి మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూశాం” అని చెప్పారు.
అప్పుడు అతడు వారితో, “నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను” అన్నాడు.
ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో చెప్పారు. తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు.
తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.