యోహాను 2:13-22

యోహాను 2:13-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యూదుల పస్కా పండుగ దగ్గర పడుతున్నప్పుడు, యేసు యెరూషలేముకు వెళ్లారు. దేవాలయ ఆవరణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మడం, మరికొందరు విదేశీ డబ్బులు మార్చే బల్లల దగ్గర కూర్చొని ఉండడం ఆయన చూసారు. ఆయన తాళ్ళతో ఒక కొరడాను చేసి, గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయ ఆవరణంలో నుండి బయటకు తోలివేసి, డబ్బు మార్చే వారి నాణాలను చెల్లాచెదురు చేసి వారి బల్లలను పడవేసారు. పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడి నుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు. “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది” అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు యూదులు ఆయనకు స్పందించి, “ఇదంతా చేయడానికి నీకు అధికారం ఉన్నదని నిరూపించడానికి మాకు ఏ సూచనను చూపిస్తావు?” అని ఆయనను అడిగారు. యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు దినాలలో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు. దానికి వారు, “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది, నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?” అని అడిగారు. అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను నమ్మారు.

షేర్ చేయి
Read యోహాను 2

యోహాను 2:13-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు. అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు. ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు. పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు. ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు. దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు. అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు. అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి. ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.

షేర్ చేయి
Read యోహాను 2

యోహాను 2:13-22 పవిత్ర బైబిల్ (TERV)

యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు. ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు: “నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.” యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.” యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు. కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.

షేర్ చేయి
Read యోహాను 2

యోహాను 2:13-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్మువారితో–వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు– నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి. కాబట్టి యూదులు –నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు –ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడుదినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడుదినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను. ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి.

షేర్ చేయి
Read యోహాను 2