యోహాను 2:13-22

యోహాను 2:13-22 TCV

యూదుల పస్కా పండుగ దగ్గర పడుతున్నప్పుడు, యేసు యెరూషలేముకు వెళ్లారు. దేవాలయ ఆవరణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మడం, మరికొందరు విదేశీ డబ్బులు మార్చే బల్లల దగ్గర కూర్చొని ఉండడం ఆయన చూసారు. ఆయన తాళ్ళతో ఒక కొరడాను చేసి, గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయ ఆవరణంలో నుండి బయటకు తోలివేసి, డబ్బు మార్చే వారి నాణాలను చెల్లాచెదురు చేసి వారి బల్లలను పడవేసారు. పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడి నుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు. “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది” అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు యూదులు ఆయనకు స్పందించి, “ఇదంతా చేయడానికి నీకు అధికారం ఉన్నదని నిరూపించడానికి మాకు ఏ సూచనను చూపిస్తావు?” అని ఆయనను అడిగారు. యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు దినాలలో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు. దానికి వారు, “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది, నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?” అని అడిగారు. అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను నమ్మారు.