యోహాను 19:1-41

యోహాను 19:1-41 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆ తర్వాత పిలాతు యేసుని కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించి, ఆయన దగ్గరకు మాటిమాటికి వెళ్లి, ఆయనతో, “యూదుల రాజా నీకు శుభం!” అని ఎగతాళి చేస్తూ, ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టారు. పిలాతు మరొకసారి బయటకు వచ్చి యూదులతో, “చూడండి, ఈయనలో నాకు ఏ నేరం కనిపించలేదని చెప్పడానికి ఈయనను బయటకు మీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను” అని చెప్పాడు. యేసు బయటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఊదారంగు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. పిలాతు వారితో, “ఇదిగో, ఈ మనుష్యుడు!” అని చెప్పాడు. ముఖ్య యాజకులు మరియు వారి అధికారులు ఆయనను చూడగానే, “సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. అయితే పిలాతు, “మీరే ఆయనను తీసుకువెళ్లి సిలువ వేయండి. నాకైతే ఆయనలో ఏ నేరం కనిపించలేదు” అన్నాడు. అందుకు యూదా నాయకులు, “మా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా తాను దేవుని కుమారుడనని చెప్పుకొంటే చట్టాన్ని బట్టి అతడు చావవలసిందే” అన్నారు. పిలాతు ఆ మాట విని మరింత భయపడి, తిరిగి తన భవనంలోనికి వెళ్లి, “నీవు ఎక్కడి నుండి వచ్చావు?” అని యేసును అడిగాడు. కాని యేసు అతనికి ఏ జవాబివ్వలేదు. “నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికైనా, సిలువ వేయడానికైన నాకు అధికారం ఉందని నీవు గ్రహించవా?” అని పిలాతు అన్నాడు. అందుకు యేసు, “నీకు ఆ అధికారం పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించినవాడు నీ కంటే మరి ఎక్కువ పాపం చేశాడు” అన్నారు. అప్పటి నుండి పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కాని యూదా నాయకులు, “నీవు ఇతన్ని విడుదల చేస్తే నీవు కైసరుకు స్నేహితుడవు కావు, నేను రాజును అని చెప్పుకొనే ప్రతివాడు కైసరుకు విరోధి” అని కేకలు వేశారు. పిలాతు ఈ మాటలను విని, యేసును బయటకు తీసుకువచ్చి, రాతి బాటగా ప్రసిద్ధి చెందిన స్థలంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు. అది పస్కాను సిద్ధపరచుకొనే రోజు, అది ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది. పిలాతు, “ఇదిగో మీ రాజు” అని యూదులతో చెప్పాడు. కాని వారు, “అతన్ని తీసుకుపోండి! అతన్ని తీసుకుపోండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు. అప్పుడు ముఖ్య యాజకులు “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. చివరికి పిలాతు సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. కనుక సైనికులు యేసును తీసుకువెళ్లారు. యేసు తన సిలువను తానే మోసుకొని కపాల స్థలం అనే చోటికి తీసుకువెళ్లారు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి “గొల్గొతా” అని పేరు. అక్కడ ఆయనతోపాటు మరో ఇద్దరిని, ఆయనకు ఇరువైపుల ఉంచి వారి మధ్యలో యేసును సిలువ వేశారు. మరియు పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును కొట్టించాడు. అది ఇలా ఉంది: నజరేతువాడైన యేసు, యూదుల రాజు. యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటనను హెబ్రీ, లాటిను మరియు గ్రీకు భాషలలో వ్రాయించారు కనుక యూదులలో చాలామంది దానిని చదివారు. ముఖ్యయాజకులైన యూదులు దానిని వ్యతిరేకించి పిలాతును, “యూదుల రాజు అని వ్రాయవద్దు కాని యూదులకు రాజునని చెప్పుకొనేవాడు” అని వ్రాయమని అడిగారు. అందుకు పిలాతు, “నేను వ్రాసిందేదో వ్రాసేసాను” అని జవాబిచ్చాడు. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత, వారు ఆయన బట్టలను తీసుకొని, ఒక్కొక్కరికి ఒక భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు కాని ఆయనపై అంగీ, ఏ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు ఒకే బట్టగా నేయబడింది. కనుక వారు, “దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకొంటారు” అని చెప్పుకొన్నారు. లేఖనంలో వ్రాయబడినట్లు, “వారు నా వస్త్రాలను పంచుకొన్నారు మరియు నా అంగీ కొరకు చీట్లు వేశారు” అని నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు. యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. యేసు అతని తల్లి మరియు తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉన్నారని చూసి, ఆయన తన తల్లితో “అమ్మా, ఇదిగో నీ కుమారుడు” అని, తర్వాత తన ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అని చెప్పారు. అప్పటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆ తర్వాత, యేసు అంతా ముగిసినదని గ్రహించి లేఖనాలు నెరవేరేలా, “దాహంగా ఉంది” అన్నారు. అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరస పాత్రలో, వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మతో చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు. ఆయన చిరకాను పుచ్చుకొని, “సమాప్తమైనది” అని చెప్పి యేసు తన తలను వంచి తన ప్రాణం విడిచారు. అది సిద్ధపాటు రోజు, మరుసటి దినము ప్రత్యేకమైన సబ్బాతు దినం. సబ్బాతు దినాన సిలువపై వారి దేహాలు ఉండకూడదని యూదా నాయకులు భావించి సిలువ వేయబడిన వారి కాళ్ళను విరగగొట్టి, వారి దేహాలను కిందకి దింపివేయాలని వారు పిలాతును అడిగారు. కనుక సైనికులు వచ్చి యేసుతోపాటు సిలువ వేసిన మొదటివాడి కాళ్ళను తర్వాత రెండవవాడి కాళ్ళను విరుగగొట్టారు. కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్ళను విరుగగొట్టలేదు. కాని సైనికులలో ఒకడు యేసుని బల్లెంతో ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం మరియు నీరు కారాయి. అది చూసినవాడు సాక్ష్యం ఇచ్చాడు, అతని సాక్ష్యం నిజం. అతడు నిజం చెప్తున్నాడని అతనికి తెలుసు. మీరు కూడా నమ్మడానికి అతడు సాక్ష్యమిస్తున్నాడు. లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ఆయన ఎముకల్లో ఒక్కటైనా విరువబడలేదు” అని నెరవేరేలా ఇది జరిగింది. మరియు ఇతర లేఖనాల్లో, “వారు తాము పొడిచిన వానివైపు చూస్తారు” అని వ్రాయబడి ఉంది. ఆ తర్వాత యూదా నాయకులు భయపడి, రహస్యంగా యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయికు చెందిన యోసేపు యేసు దేహాన్ని తాను తీసుకెళ్తానని పిలాతును వేడుకొన్నాడు. పిలాతు అనుమతితో, అతడు వచ్చి యేసు దేహాన్ని తీసుకువెళ్ళాడు. అతనితో పాటు, గతంలో ఒక రాత్రి వేళ యేసుతో మాట్లాడిన నీకొదేము కూడా ఉన్నాడు. నీకొదేము ఇంచుమించు ముప్పైనాలుగు కిలోగ్రాముల బోళం మరియు అగరుల మిశ్రమాన్ని, శవం కుళ్ళిపోకుండా ఉంచే సుగంధ ద్రవ్యాలను తనతో తీసుకొనివచ్చాడు. వారిద్దరు యేసు దేహాన్ని తీసుకువెళ్లి, యూదుల ఆచారం ప్రకారం దానికి సుగంధ ద్రవ్యాలను పూసి, నారబట్టతో చుట్టారు. యేసును సిలువ వేసినచోట ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఎవరిని పెట్టని ఒక క్రొత్త సమాధి ఉన్నది.

షేర్ చేయి
Read యోహాను 19

యోహాను 19:1-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి, “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు. పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, “ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను” అని వారితో అన్నాడు. కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు. ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, “సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!” అని, కేకలు వేశారు. పిలాతు వారితో, “ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి” అన్నాడు. యూదులు పిలాతుతో, “మాకొక చట్టం ఉంది, అతడు తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆ చట్టాన్ని బట్టి అతడు చావ వలసిందే,” అన్నారు. పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి, “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి ఏ జవాబూ చెప్పలేదు. అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు. అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు. పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు. అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు. వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు. తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు. అక్కడ వారు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య సిలువ వేశారు. పిలాతు, ఒక పలక మీద ‘ నజరేతు వాడైన యేసు, యూదుల రాజు’ అని రాయించి సిలువకు తగిలించాడు. యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు. యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో, “‘యూదుల రాజు’ అని కాకుండా, అతడు ‘నేను యూదుల రాజును అని చెప్పుకున్నాడు’ అని రాయించండి” అన్నాడు. పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అని జవాబిచ్చాడు. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసుకుని నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకున్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి, వారు ఒకరితో ఒకరు, “దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం” అన్నారు. “నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు, నా దుస్తుల కోసం చీట్లు వేశారు,” అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు. యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు. తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు. అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు. యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు. అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. “అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. “వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది. ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు. వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం. ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది.

షేర్ చేయి
Read యోహాను 19

యోహాను 19:1-41 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు. భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు. పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు. యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో, “ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు. ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకు వెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు. కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు. కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. తాను, ‘దేవుని కుమారుడను’ అని అన్నాడు కనుక, మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన పొందాలి!” అని అన్నారు. పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు. అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ స్వగ్రామం ఏది?” అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు. పిలాతు, “నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అని అన్నాడు. యేసు సమాధానంగా, “పైన ఉన్నవాడు యిస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు” అని అన్నాడు. ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు. ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో” ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో “గబ్బతా” అని అంటారు. అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు. కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు. పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు. ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు. తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు. భటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు “పుర్రె స్థలాన్ని” చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని “గొల్గొతా” అంటారు. ఇక్కడ ఆయన్ని సిలువకు వేసారు. ఆయనకు ఇరువైపు మరొక యిద్దర్ని సిలువకు వేసారు. పిలాతు, ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ఆ ప్రకటనలో, “నజరేతు నివాసి యేసు యూదుల రాజు” అని వ్రాయబడి ఉంది. యేసును సిలువకు వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. కనుక చాలా మంది యూదులు ఈ ప్రకటన చదివారు. యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “‘యూదుల రాజు’ అని వ్రాసారెందుకు? ‘ఇతడు, తాను యూదుల రాజని అన్నాడు’ అని వ్రాయండి” అని అన్నారు. పిలాతు, “వ్రాసిందేదో వ్రాసాను” అని సమాధానం చెప్పాడు. భటులు యేసును సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రింది దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది. ఆ భటులు, “దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేసారు: “వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు! నా దుస్తుల కోసం చీట్లు వేసారు!” లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి యిలా జరిగింది. యేసు సిలువదగ్గర ఆయన తల్లి, తల్లి యెక్క సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, నిలుచొని ఉన్నారు. యేసు తన తల్లి, తన ప్రియ శిష్యుడు అక్కడ నిలుచొని ఉండటం చూసాడు. తన తల్లితో, “అమ్మా! ఇదిగో నీ కుమారుడు” అని అన్నాడు. ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి!” అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది. పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు. ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు. అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు. భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు కారాయి. మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు. లేఖనాల్లో వ్రాయబడిన విషయాలు నిజం కావటానికి యిలా జరిగింది. ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది: “ఆయనలో ఒక్క ఎముక కూడ విరువబడదు.” మరొక చోట, ఇలా వ్రాయబడివుంది: “తాము పొడిచిన వాని వైపు వాళ్ళు చూస్తారు.” ఆ తర్వాత “అరిమతయియ” గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు. అతని వెంట “నీకొదేము” కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి, దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల సాంప్రదాయం. యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధిఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు.

షేర్ చేయి
Read యోహాను 19

యోహాను 19:1-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి. పిలాతు మరల వెలుపలికి వచ్చి–ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు– ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి–సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు–ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు–మాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పు కొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి యెక్కు వగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి –నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు–నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను. అందుకు యేసు–పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులు–నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి. పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు–ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు–ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు–మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు–కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనినిమధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి. మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. –నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను. సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్ర్తములు తీసికొని,యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు–దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి.వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును. –అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది. అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.

షేర్ చేయి
Read యోహాను 19